ప్రణయ్ హత్య కలచివేసింది:మనోజ్

221
manchu Manoj
- Advertisement -

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ప్రాంతాలకు అతీతంగా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రణయ్ హత్యపై స్పందించగా తాజాగా మంచు మనోజ్ స్పందించారు. ఓ భావోద్వేగ లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన మనోజ్ కులపిచ్చిని రూపుమాపుదాం అని పిలుపునిచ్చారు.

మానవత్వం కంటే కులం, మతం గొప్పవని భావించే ప్రజల కోసం ఈ లేఖ రాస్తున్నానని చెప్పారు. కులాన్ని సమర్థించే వారంతా ప్రణయ్, అతని లాంటి చాలా మందిపై జరుగుతున్న జుగుప్సాకరమైన దాడులకు బాధ్యత వహించాలని చెప్పారు. ఇంకా లోకాన్నే చూడని పసికందు… తన తండ్రి స్పర్శను తెలుసుకోకముందే… అతని చేతిని పట్టుకోకముందే… తండ్రిని
కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏ ఫీల్డ్‌లో అయినా కుల పిచ్చి.. దానిపై ఆధారపడిన సినీ నటులు(ఫ్యానిజం), రాజకీయ పార్టీలు, కాలేజ్ యూనియన్లు, కుల, మత సంస్థలు అన్నీ అనాగరికమైనవన్నారు. మనందరికీ హృదయం, శరీరం ఒకే తీరుగా ఉన్నాయి. మనమంతా ఒకే గాలిని పీలుస్తున్నాం… ఒకే సమాజంలో జీవిస్తున్నాం. అలాంటపుడు కులం పేరుతో ఈ వివక్ష ఎందుకని ప్రశ్నించారు.

కాస్త కళ్లు తెరచి మనుషుల్లా ప్రవర్తించండి ..ప్రణయ్ భార్య అమృత, అతని కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నా. .ప్రణయ్ మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం. మీ ఆత్మకు శాంతి కలగాలి అంటూ ట్వీట్‌ చేశారు.

- Advertisement -