మహమెట్రో సంస్ధ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం

495
ktr
- Advertisement -

మహారాష్ట్రలో పలు నగరాల్లో మెట్రో సౌకర్యాన్ని ఎర్పాటు చేసే కార్యక్రమానికి భాద్యత వహిస్తున్న మహా మెట్రో సంస్ధ అధికారులతో మంత్రి కె. తారక రామారావు సమావేశం అయ్యారు. మహారాష్ట్ర నాసిక్, పూణే, నాగపూర్ వంటి నగరాల్లో మెట్రో ఏర్పాటు కార్యక్రమాలను తామే నిర్వహిస్తున్నామని, వాటి కోసం చేపట్టిన కార్యక్రమాలు, నిర్మాణం తాలుకు వివరాలతో మహా మెట్రో అధికారులు ఒక సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న మెట్రో వ్యవస్థకి కొంత భిన్నంగా, అతి తక్కువ ఖర్చుతో “మెట్రో నియో” పేరుతో నాసిక్ పట్టణంలో ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టు వివరాలను ఈ సమావేశంలో మంత్రికి, పురపాలక శాఖాధికారులకు అందించారు. ప్రస్తుతం తాము సిద్ధం చేస్తున్న ఈ ప్రతిపాదనలతో ప్రాజెక్టు వ్యయం ఘననీయంగా తగ్గుతుందని, స్వల్ప కాలంలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. సాంప్రదాయ మెట్రోలో రైల్వే కోచ్ లు ఉపయోగిస్తుండగా ప్రస్తుతం తాము ప్రతిపాదించిన మెట్రోలో ఎలక్ట్రిక్ బస్సు కోచ్ లను ఉపయోగించనున్నట్లు తెలిపారు.

ఎలివేట్ కారిడార్ లతో పాటు ప్రస్తుతం ఉన్న రోడ్ల పైన కూడా ఈ మెట్రో నడుస్తుందని తెలిపారు. 350 నుంచి 400 మంది ప్రయాణికులు ఒకే సారి ప్రయాణం చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రస్తుతం నాసిక్ లో తమ ప్రతిపాదనల్లో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కోచ్ వచ్చేందుకు అవకాశం ఉందని, దీన్ని రెండు నిమిషాలకు ఒకసారి కోచ్ లు వచ్చేలా చేసేందుకు కూడా వీలుందన్నారు. ప్రస్తుతం తాము నిర్మిస్తున్న ఎలివేటెడ్ ఫ్లైఓవర్ ను పట్టణ అవసరాలు, ప్రయాణీకుల రద్దీ పెరిగితే, సుదీర్ఘ కాలంలో దీన్ని సాదరణ మెట్రో మార్గంగా మార్చుకునేందుకు కూడా వీలుకలిగేలా తమ ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. నాసిక్ మెట్రో కోసం తాము సిద్ధం చేసిన ప్రతిపాదనలతో పాటు వాటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరుల వివరాలను కూడా ఈ సమావేశంలో మహా మెట్రో అధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సూమారు 25 శాతం నిధులు ఈ ప్రాజెక్టు కోసం అందే అవకాశం ఉందని తెలిపారు.

ktr

మహా మెట్రో అధికారులు అందించిన ప్రజంటేషన్ పైన పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. ఈమద్య కేంద్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసినప్పుడు కేంద్రం ద్వీతీయ శ్రేణి పట్టణాలకు మెట్రోలైట్, మెట్రోనియో వంటి ప్రతిపాదనలకు సహయం అదించేందుకు సుముఖంగా ఉన్నదని తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ఈనేపథ్యంలో నాసిక్ లాగానే తెలంగాణ రాష్ట్రంలోనూ ద్వితీయ శ్రేణి నగరాల కోసం తక్కువ ఖర్చుతో కూడిన మెట్రో నియో లాంటి ప్రతిపాదనలు అనుగుణంగా ఉంటాయని మంత్రి అన్నారు. నూతనంగా హైదరాబాద్ నగరం కోసం అలోచిస్తున్న ఎలివేటేడ్ బిఅర్ టియస్ ప్రతిపాదనల రూపకల్పనలో మహమెట్రో సంస్థ అధికారులతో కలిసి పనిచేయాలన్నారు. దీంతోపాటు మహమెట్రో సంస్ధ పాటిస్తున్న 100శాతం లిక్విడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, రెయిన్ వాటర్ హర్వేస్టింగ్ పద్దతులు, మెట్రో స్టేషన్లపైన సోలార్ విద్యుత్ ఉత్పాదన, తక్కువ భూసేకరణ ఖర్చు వంటి అంశాలను ఈ ప్రతిపాదనల్లో పరిశీలించాలన్నారు. పశ్చిమ హైదరబాద్లోని జనసమ్మర్ధ ప్రాంతాల్లోనూ ఏలివేటెట్, ఎలక్ర్టిక్ బిఅర్ టియస్ కోసం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇదే పద్దతిలో నాసిక్ లో ఎర్పాటు చేస్తున్న మెట్రో నియో మాడల్ ను అధ్యయనం చేయాలని మెట్రో రైల్ సంస్ధను అదేశించారు.

సమగ్ర ప్రతిపాదనలతో ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాలని కోరారు. దీంతోపాటు నగరంలో ఉన్న అర్టీసి, మెట్రో, యంయంటియస్, భవిష్యత్తులో రానున్న మెట్రో రెండవదశ మార్గాలు, ఇంటర్ సిటీ బస్ టెర్మినళ్లను, అవుటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాలను కలిపేందుకు ఉన్న అవకాశాలను, మార్గాలను అధ్యయనం చేయాలని, నగరంలో సమగ్ర ప్రజారవాణ బలోపేతం దిశంగా ఒక నివేదికను సిద్దం చేయాలని కోరారు. దీంతోపాటు నాగ్ పూర్ పట్టణంలో మెట్రో, రోడ్డు మార్గాల కోసం డబుల్ డెక్కర్ ఫైఒవర్ల నిర్మాణం చేస్తున్నందున, హైదరాబాద్ నగరంలోనూ ఇలాంటి అంశాన్ని పరిశీలించాలని జియచ్ యంసి అధికారులను కోరారు. దీని వలన భూసేకరణ ఖర్చు తగ్గుతుందని, భవిష్యత్తులో మెట్రోమార్గాల ఎర్పాటు సులభం అవుతుందన్నారు.

ktr

ఈ సమావేశంలో మహామెట్రోయండి బ్రిజేష్ దీక్షిత్, మరియు సంస్థ ప్రతినిధులు, నగర మేయర్ బొంతు రామ్మోహాన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కూమార్, హెచ్ యంఅర్ ఏల్ యండి ఎన్వీయస్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Maharasthra Metro officials meets KTR…Maharasthra Metro officials meets KTR

- Advertisement -