సభ్యత్వ నమోదుపై టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి..

409
- Advertisement -

రాజధానిలో పార్టీ సభ్యత్వంపైన టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్ గిరి, చెవెళ్ల నియోజకవర్గాల వారీగా ఈ మేరకు సమీక్షా సమావేశాలను తెలంగాణ భవన్‌లో నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సభ్యత్వం జరుగుతున్న తీరుని కేటీఆర్ సమీక్షించారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు 50 వేల సభ్యత్వ నమోదు పుస్తకాలు చేరుకున్నాయని, చాల వరకు నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు చురుగ్గా సాగుతున్నదని ఎమ్మెల్యేలు తెలిపారు. ఇప్పటికే అన్ని పుస్తకాలు క్షేత్రస్ధాయిలో అందుబాటులో ఉన్నాయని, సగానికిపైగా పుస్తకాలు డిజిటలీకరణ కేంద్రాలకు చేరుకున్నాయని వారు కేటీఆర్‌కు తెలిపారు.

పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సభ్యత్వ నమోదు చురుగ్గా సాగుతున్న నేపథ్యంలో మొత్తం ప్రక్రియను ఈ నెల 10వ తేది లోపల పూర్తి చేయాలన్నారు. ఈ పదిరోజుల్లో పూర్తి స్ధాయిలో సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని పూర్తి చేసేలా చూడాలని ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జీలకు కేటీఆర్ సూచించారు. 10 తేది నుంచి 20 తేది లోపల బూత్, డివిజన్ కమీటీలను ఏర్పాటును పూర్తి చేయాలన్నారు. నగరంలో దాదాపు 2000 నోటిపైడ్ స్లమ్స్ ఉన్నాయని, ఈ మేరకు ప్రతి బస్తీకి ఒక కమీటీ ఏర్పాటు చేయాలన్నారు. 20 తేది నాటికి బస్తీ కమీటీలతోపాటు డివిజన్ కమీటీలను కూడా ఏర్పాటు చేయాలన్నారు.

ktr meeting

ప్రతి కమీటీలో అందరు క్రియాశీలక సభ్యులే ఉండాలన్నారు. కనీసంగా 15 మంది సభ్యులు, గరిష్టంగా 33 మంది సభ్యులు కమీటీలో ఉండవచ్చన్నారు. కనీసం యాబైశాతం యస్సీ, యస్టీ, బిసి, మైనార్టీలే ఉండాలన్నారు. కమీటీల ఏర్పాటులో భాగంగా అనుబంద సంఘాలను కూడా ఏర్పాటు చేయాలని కేటీఆర్ సూచించారు. ఇప్పటికే లక్ష్యం పూర్తిచేసిన జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, ఎల్ బి నగర్ నియోజకవర్గాల్లో త్వరలోనే కమీటీలు వేయాలని కేటీఆర్ ఎమ్మేల్యే మాగంటి గోపినాద్, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డిలకు సూచించారు. లక్ష మంది సభ్యత్వ లక్ష్యంతో పనిచేస్తున్న మేడ్చేల్ నియోజకవర్గంలోనూ చాల చురుగ్గా సభ్యత్వం నడుస్తున్నదని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను నగర ప్రజల్లోకి తీసుకుపోవాలని కేటీఆర్ సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు చేరుకున్నాయని, కాళేశ్వరం వలన నగర నీటి అవసరాలకు ఎలాంటి సమస్య తలెత్తకుండా ఉంటుందన్న కేటీఆర్ ఈ విషయాన్ని నగర ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలన్నారు. ముఖ్యమంత్రి ముందుచూపు వలనే నగరంలో తాగునీటి, విద్యుత్ కొరత లేదని కేటీఆర్ అన్నారు. రాజకీయంగాను నగరంలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదన్న కేటీఆర్ ప్రజల్లోనూ టీఆర్ఎస్ పట్ల అభిమానం ఉన్నదని తెలిపారు. పార్టీని సంస్ధాగతంగా మరింత బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు సూచించారు.

సమావేశం నుంచి పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభ్యులుగా చేరిన పలువురితో కేటీఆర్ స్వయంగా మాట్లాడారు. సభ్యులుగా చేరిన ప్రతి ఒక్కరికి భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నదని, ఈ మేరకు నిన్ననే భీమా చెల్లించామని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారికి కేటీఆర్ తెలిపారు. కాగా ఈ సమావేశంలో మంత్రులు మహ్మమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జీలు పాల్గొన్నారు.

- Advertisement -