పారిశుద్ధ్య నిర్వహణలో పాల్గొన్న మంత్రి కేటీఆర్..

308
ktr

సీజనల్ వ్యాధుల నివారణ ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జన సమర్థ ప్రదేశాలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, జిహెచ్ఎంసి తరుపున దోమల నివారణతో పాటు పరిశుభ్రత నిర్వహణ చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ సొంత ఇళ్లలో పారిశుద్ధ్య నిర్వహణ పైన దృష్టి సారించి ప్రభుత్వ ప్రయత్నాలతో కలిసి రావాలన్నారు. ముఖ్యంగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు సొంత ఇళ్లలోని పారిశుద్యం అత్యంత కీలకమైన అంశం అని అన్నారు.

KTR

నిన్న జిహెచ్ఎంసి కార్యాలయంలో సీజనల్ వ్యాధుల పైన వైద్య శాఖ మంత్రి మరియు వైద్య శాఖ అధికారులు, పురపాలక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం సొంత ఇళ్ళలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ డ్రైవ్‌లో ప్రజలను చైతన్యవంతం చేసి పారిశుద్ద్యం నిర్వహణలో వారిని భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వ అధికారులు, పురపాలక ప్రతినిధులు తమ సొంత ఇళ్ళలోని పారిశుధ్య నిర్వహణ చేపట్టి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని కోరారు.

KTR

ఈ మేరకు మంత్రి కేటీఆర్ తన నివాస గృహం ప్రగతి భవన్‌లోని పారిశుద్ధ్య నిర్వహణ పైన దృష్టిసారించారు. ముఖ్యంగా దోమల వృద్ధికి అవకాశం ఉన్న ఉన్న నీటి తొట్లు, మరియు నీటి నిలువ ప్రదేశాల్లో నీటిని తొలగించే చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు ఇంటి మూలల్లో ఉన్న ఉపయోగంలో లేని వస్తువులను తీసివేసి దోమల లార్వా వృద్ధికి అవకాశం లేకుండా చేసే చర్యలను చేపట్టారు. ఈ మేరకు ప్రగతి భవన్‌లోని నీటి తొట్లలో ఆయన నూనె వేశారు. ప్రతి ఒక్కరూ స్వంత ఇంటి పారిశుద్ధ్య నిర్వహణ పైన దృష్టి సారించి సీజనల్ వ్యాధుల బారి నుంచి కాపాడుకునే ప్రయత్నం ప్రారంభించాలని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు.

KTR

ముఖ్యంగా ఇళ్ళ ముందు కానీ లేదా ఇంటి లోపల నీటి నిలువ ఉండే ప్రాంతాల్లో నీటిని తొలగించే ప్రయత్నం చేయడం లేదా వాటిపైన నూనెను చల్లడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. దీంతోపాటు ఇళ్లలో ఉన్న పనికిరాని లేదా ఉపయోగం లేని వస్తువులను తొలగించుకోవాలని కోరారు. మంత్రి కేటీఆర్ వెంట నగర మేయర్ బొంతు రామ్మోహన్ మరియు శాసనసభ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కూడా ఉన్నారు. మంత్రి ఇచ్చిన పిలుపుమేరకు తాము కూడా సొంత ఇంటి పారిశుద్ధ్య నిర్వహణ పైన అవసరమైన చర్యలు చేపడతామని వారిరువురు మంత్రి కేటీఆర్‌కి తెలిపారు.