పండగ వాతావరణంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు:కేటీఆర్

424
ktr
- Advertisement -

పండగ వాతావరణంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సభ్యత్వ నమోదు కోసం సోషల్ మీడియాను పెద్దఎత్తున ఉపయోగించుకోవాలని టెలికాన్ఫరెన్స్‌ ద్వారా నేతలకు సూచించారు.

ప్రస్తుతం సభ్యత్వ నమోదు చురుగ్గా జరుగుతుందన్న కేటీఆర్ ఈ మేరకు పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. స్ధానిక మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఎంపీలు సమిష్టిగా ఎక్కడికక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మున్సిపల్ ప్రాంతాల్లో సభ్యత్వ నమోదుపైన ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

పట్టణ ప్రాంతాల్లో విద్యావంతులు, వృత్తి నిపుణులను కలిసి సభ్యత్వం ఇచ్చేలా చూడాలన్నారు. పట్టణాల్లోని రెసిడెంట్, కాలనీ వెల్పేర్ అసోషియేషన్లను కలిసి పార్టీలో చేర్చుకునేలా చూడాలన్నారు. దీంతోపాటు పట్టణాల్లోని యువకులు, విద్యావంతులు పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నందున స్వచ్చందంగా చేరేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం, అన్ లైన్ ద్వారా చేరేలా చూడాలన్నారు. ఇందుకోసం అయా వర్గాలను స్వయంగా కలవాలని పార్టీ శ్రేణులను కోరారు.

ఈ నెలాఖరున లేదా వచ్చేనెల మొదటి వారంలో పురపాలికల ఎన్నికలుండే అవకాశం ఉన్న నేపథ్యంలో పట్టణాల్లో నమోదు సాద్యమైనంత త్వరగా, ఎక్కువ మందిని చేర్చేలా చూడాలన్నారు. స్ధానిక యంఎల్యేలు, యంపిలు, సీనియర్ నాయకుల సందేశాలు ఉపయోగించుకుని, వాటిని స్ధానిక కేబుల్ టీవీలతోపాటు వాట్సప్ , ఇతర సోషల్ మీడియా మాద్యమాల్లో వాడుకుని స్ధానిక యువతను, కార్యకర్తలను సభ్యత్వ నమోదుకు కదిలించాలన్నారు.

సభ్యత్వ నమోదుపైన అన్ని జిల్లాల ఇంచార్జీలతో టెలికాన్ఫరెన్సులో కెటియార్ మాట్లాడారు. ప్రస్తుతం ప్రత్యేకంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఇంటింటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకుపోవాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో వ్యవసాయ పనులు ప్రారంభం అయిన నేపథ్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

పార్టీ అనుబంధ సంఘాలు ఈ కార్యక్రమంలో మరింత యాక్టివ్ కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా బీడి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అటో డ్రైవర్లు మొదలయినటువంటి కార్మిక క్షేత్రాల్లోకి నేరుగా వెళ్లాలన్నారు. ఇప్పటిదాకా జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు మండలాలు, పట్టణాల వారీగా నమోదు, పుస్తకాలు తిరిగి ఇవ్వడం, వాటి డిజిటలీకరణ ఎంత వరకు పూర్తయింది అన్న వివరాలను సేకరించి పార్టీ అందించాలని కెటియార్ కోరారు. ఈ వివరాలను ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌కు అందిస్తామన్నారు.

పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతిచోట పండుగ వాతావరణంలో సభ్యత్వనమోదు కొనసాగుతన్నదని క్షేత్రస్ధాయిలో పనిచేస్తున్న ఇంచార్జీలు కేటీఆర్‌కి తెలిపారు. ప్రస్తుతం ప్రతి నియోజక వర్గానికి చేరిన 50 నుంచి 60 వేల సభ్యత్వ నమోదు పుస్తకాల లక్ష్యాలను గడువులోగా పూర్తి చేస్తామని కేటీఆర్‌కు తెలిపారు.

- Advertisement -