మినీట్యాంక్‌బండ్‌గా పానగల్లు: కేటీఆర్

413
ktr

తెలంగాణ ఆడబిడ్డల బ్రతుకు జీవనం బతుకమ్మ అని తెలిపారు మంత్రి కేటీఆర్. నల్గొండలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేటీఆర్ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.రాష్ట్రంలోని నేతన్నలకు బతుకు దెరువునిస్తూ ఆడబిడ్డల మనస్సు గెలుచుకునేలా 100 రకాల చీరలను ఈ సారి తయారు చేయించామన్నారు. కోటిమందికి చేనేత చీరలు ఇస్తున్నామని చెప్పారు.

తెలంగాణకు మాత్రమే పరిమితమైన పండుగ బతుకమ్మ అన్నారు. ఉరిసిల్లగా మారిన సిరిసిల్లలో ఆత్మహత్యలు చూసి కేసీఆర్ చలించిపోయారని..అందుకే వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు ప్రభుత్వ పరంగా అన్నిరకాల ఆయం అందిస్తున్నామని చెప్పారు.

గతంలో 7 వేల నుంచి 8 వేలు సంపాదించే నేతన్నలు బతుకమ్మ చీరల తయారి ద్వారా నెలకు 16 వేల నుంచి 20 వేల వరకు సంపాదిస్తున్నారని వెల్లడించారు. చీరల తయారికి ఉపయోగించే ఉపకరణాలను 50 శాతం సబ్సిడీతో అందిస్తున్నామని చెప్పారు. చేనేతలక్ష్మీ ….నేతన్నలకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతీ సోమవారం ఖచ్చితంగా అంతా చేనేత వస్త్రాలే ధరిస్తున్నామని తెలిపారు కేటీఆర్. ప్రజలంతా చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

నల్గొండ నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నల్గొండలో మెడికల్ కాలేజీ ఏర్పాటుచేశామని తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతికి ధీటుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మునుగోడులో ఓ పారిశ్రామిక పార్కును ప్రారంభించబోతున్నామని చెప్పారు. దామరచర్లలో పవర్ ప్లాంట్ నిర్మాణం శరవేగంగా జరుగుతుందన్నారు. చెరువులు నిండుతున్నాయి….ప్రాజెక్టులు కలకలలాడుతున్నాయని వెల్లడించారు. కళ్యాణలక్ష్మీ,షాది ముబారక్,కేసీఆర్ కిట్‌ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. పానగల్లు చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌గా మారుస్తామని ఇందుకు అవసరమైన రూ. 35 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.