రాజస్థాన్‌పై పై కోల్ కతా ఘనవిజయం…

278
Kolkata Knight Riders beat Rajasthan Royals
- Advertisement -

ఐపీఎల్‌11లో భాగంగా కోల్‌కతా అదరగొట్టింది. ఆల్‌రౌండ్‌షోతో రాజస్థాన్‌ రాయల్స్‌ ను చిత్తుచేసింది. దీంతో మూడో విజయం సాధించిన కోల్‌కతా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 161 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా సునాయసంగా విజయం సాధించింది.ఆరంభంలోనే లిన్ (0) వికెట్ కోల్పోయినప్పటికీ రాబిన్‌ ఉతప్ప (48), సునీల్ నరైన్‌ (35‌) ధాటిగా ఆడడంతో లక్ష్యానికి చేరువైంది. దినేష్ కార్తీక్ (42), నితీశ్ రాణా (35) రాణించడంతో కోల్‌కతా 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన నితీశ్ రాణా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గా నిలిచాడు.

టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్ తొలి మూడు ఓవర్లలో ఆచితూచి ఆడింది. నాలుగో ఓవర్‌లో రహానే జూలు విదిల్చి వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు. ఆ తరువాతి ఓవర్లో 13 పరుగులు పిండుకున్నారు. స్కోరు బోర్డు ఉరకలెత్తుతుండగా, కోల్ కతా కెప్టెన్ దినేష్ కార్తీక్, రహానే (36) ను అద్భుతమైన త్రోతో రనౌట్ చేసి పెవిలియన్ కు పంపాడు. ఆ తరువాత షార్ట్ (44) మినహా మిగిలిన ఆటగాళ్లంతా విఫలమయ్యారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్ లో ఓటమి ద్వారా సొంత మైదానంలో కొనసాగిన రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్రకు కోల్ కతా జట్టు అడ్డుకట్ట వేసింది. ఈ మైదానంలో వరుసగా 9 మ్యాచ్ లలో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది.

- Advertisement -