గణేశ్‌ నిమజ్జనం ఏర్పాట్లు…షురూ

437
vinayaka nimajjanam

గణేశ్ నిమజ్జనానికి పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. 12వ తేది ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నగరంలో మద్యం దుకాణాలు మూసివేయాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైన నిబంధనలను అతిక్రమించి మద్యం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

గణేష్ నిమజ్జన వేడుకలకు 21 వేల మంది పోలీసుతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. అలాగే గణేష్ మండపాల వద్ద, శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో డీజేకు అనుమతి లేదని చెప్పారు. నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలు విధిస్తామని అన్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్ , స్పెషల్ బ్రాంచ్ పోలీసులు 24 గంటలూ షిప్టుల ప్రకారం అందుబాటులో ఉండనున్నారు.

ఇక ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఖైరతాబాద్ మహాగణపతిని తొలి నిమజ్జనం చేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు సాగరంలో స్వామి వారిని నిమజ్జనం చేస్తారు. 61 అడుగుల ఎత్తులో 27 అడుగుల వెడల్పులో కొలువుదీరిన శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతిని ఎలాంటి ఆటంకాలు లేకుండా తరలించేందుకు పోలీసు యంత్రాంగం సూచనల మేరకు ముందుస్తుగా ఏర్పాట్ల చేస్తున్నారు.

ఇవాళ రాత్రి నుంచి మహాగణపతి నిమజ్జన ఏర్పాట్లును ప్రారంభిస్తారు . గత దశాబ్ద కాలంగా ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం. 4 వద్దే నిమజ్జనం చేస్తున్నారు. అయితే ఈ సారి క్రేన్ నెం. 4 లేదా క్రేన్ నెం. 6 లలో ఏదైనా ఒకదానిని ఎంపిక చేసే అవకాశం ఉంది. మొత్తంగా గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తోంది జీహెచ్‌ఎంసీ.