ఈ నెల 17న ఏపీ,తెలంగాణ సీఎంల సమావేశం..

95
KCR and Jagan

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎంలు మరోసారి చర్చించనున్నారు. ఈ నెల 21న నిర్వహించనున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ సీఎం వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించడానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ నెల 17న విజయవాడకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు సీఎంలు రాష్ట్ర విభజన వివాదాలపై మరోసారి చర్చలు జరపనున్నారు.

KCR and Jagan

దీని కోసం వివరాలు సిద్ధంగా ఉంచాలని తెలంగాణ సీఎం కార్యాలయం గురువారం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రధానంగా విద్యుత్తు ఉద్యోగుల విభజన, రెండు రాష్ట్రాల మధ్య నిధుల పంచాయితీని తేల్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే భేటీలో హైదరాబాద్‌లో రెండు భవనాలను ఎంపిక చేసుకొని, ఏపీ అధీనంలోని భవనాలన్నీ ఇచ్చేయాలని సీఎం కేసీఆర్‌ ఏపీ సీఎం జగన్‌ను మరోమారు కోరే అవకాశాలున్నాయి. దీంతో అధికారులు సమగ్ర సమాచారంతో నోట్‌ను సిద్ధం చేస్తున్నారు.

ఇక 17న హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస గృహాల సముదాయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. అలాగే ఈ కార్యక్రమం కంటే ముందు 17న ఉదయం 6 గంటల నుంచి ఆర్‌ అండ్‌ బీ శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో గృహవాస్తు పూజలు నిర్వహిస్తారు. అనంతరం సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను ప్రారంభించిన అక్కడి నుండి నేరుగా విజయవాడకు బయల్దేరి వెళ్లనున్నారు.