21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం..అతిథిగా ఏపీ సీఎం

198
kaleshwaram

తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. ఈ నెల 21న సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ సీఎం జగన్ హాజరుకానున్నారు. త్వరలోనే విజయవాడకు స్వయంగా వెళ్లి జగన్ ను ఆహ్వానించనున్నారు సీఎం కేసీఆర్.

ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం మేడిగడ్డ పంప్‌హౌజ్‌ వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం ఇంకా పూర్తి కాకపోయినా.. కాఫర్‌ డ్యాంను ఏర్పాటు చేసి అవసరమైన నీటి మళ్లింపునకు చర్యలు తీసుకుంటున్నారు.ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం రోజుకు ఒక టీఎంసీ నీటిని లిఫ్టు చేసే అవకాశం ఉంది. తర్వాత దానిని రెండు టీఎంసీలకు పెంచనున్నారు.

గోదావరి నది ద్వారా మనకు వచ్చే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలంటే గోదావరిపై విరివిగా బ్యారేజీలు నిర్మించడమే మార్గమని భావించారు కేసీఆర్. గోదావరి వరదలు వచ్చినప్పుడు మన బ్యారేజీలు, రిజర్వాయర్లలో నీళ్లు నిల్వ చేసుకోవాలి. గోదావరిలో నీటి లభ్యత లేకుంటే ప్రాణహిత నదీ జలాలను గోదావరిలోకి మళ్లించుకోవాలి. ఇదీ ప్రభుత్వ వ్యూహం. ఇందులోనుంచి పురుడు పోసుకున్నదే కాళేశ్వరం ప్రాజెక్టు.

కాళేశ్వరం అందుబాటులోకి వస్తే ఇకపై రైతన్నలు వర్షాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండదు. నదికే నీళ్ళనిచ్చే జీవనదిగా మారనుంది కాళేశ్వరం . 1832 కిలోమీటర్‌ల పొడవునా, 190 టీఎంసీల గోదావరి జలాలను ఎతిు పోస్తూ 20 జిల్లాలకు ఉపయోగపడే లా డిజైన్ అయి 37లక్షల ఎకరాలకు సాగునీరందించనున్నారు.