గుండెగోడును తరిమే ..తెలంగాణ జీవనాడి కాళేశ్వరం

560
kaleshwaram project
- Advertisement -

దశాబ్దాల తెలంగాణ ప్రజల దాహార్తిని తీరుస్తూ,రైతుల జీవితాల్లో కొంగొత్త ఆశలు రేకెత్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోథల పథకం మరికొద్దిరోజుల్లో ప్రారంభంకానుంది. వందల కిలోమీటర్ల దూరం కాలువలు, సొరంగ మార్గాల నిర్మాణం, దేశంలోనే అతి పెద్ద లిఫ్టులు, ఆసియాలోనే అతి పెద్ద సర్జ్‌పూల్‌ ఏర్పాటు, భూగర్భంలోనే పంప్‌హౌస్‌లు, గోదావరి నదిపై వరుసగా బ్యారేజీల నిర్మాణం వెరసీ బాహుబలిగా రైతుల కష్టాలను కడతెర్చే తెలంగాణ జాతి కలల సౌధం వడివడిగా పరుగులెత్తేందుకు సిద్ధమవుతోంది.

1832 కిలోమీటర్ల పొడవునా,190 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోస్తూ 20 జిల్లాలకు ఉపయోగపడేలా డిజైన్ అయిన కాళేశ్వరం ఎత్తిపోథల ద్వారా 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. వేలమంది ఇంజనీర్లు,శ్రామికుల అహోరాత్రులు శ్రమించి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములయ్యారు.

Image result for kaleshwaram medigadda

మేడిగడ్డ,అన్నారం,సుందిళ్ళ,ఎల్లంపల్లిబ్యారేజీలు మేడారం,మానేరు,అనంతగిరి,బస్వాపురం,భూంపల్లి,గంధమల్ల    జలశయాలు,మల్లన్న,కొండపోచమ్మ,రంగనాయక సాగర్‌ల ద్వారా 20 జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టు మొదలయ్యేది మేడిగడ్డ ప్రాంతంలోనే.గోదావరి,ప్రాణహిత నదులు కలిసిన తర్వాత గోదారమ్మ కిందికి పరవళ్లు తొక్కుతూ వడివడిగా పరిగెత్తే గోదారమ్మకు పాదాభివందనం చేస్తూ దాదాపు 85 గేట్లతో 100 మీటర్ల హైట్‌తో 16.17 టీఎంసీల నీళ్లు నిలిచిఉండేలా బ్యారేజీ నిర్మిస్తోంది. ఇక్కడి బ్యారేజీ నిర్మాణం చేపట్టడం ద్వారా నిండు కుండలా గోదారమ్మ ఎప్పుడు పరవళ్లు తొక్కుతూ ఉంటుంది.

ఇక్కడి నుండి కన్నెపల్లి పంప్‌ హౌజ్‌కు అప్రోచ్ ఛానల్‌ ద్వారా ఎత్తిపోస్తారు. 40 మెగావాట్ల సామర్థ్యమున్న 17 మోటార్లాతో ఎత్తి 34 పైపుల గుండా గ్రావిటీ ప్రెషర్ కాలువలో పోస్తారు. అయితే ఇక్కడున్న 17 మోటార్లలో 11 మాత్రమే పనిచేస్తాయి. మిగితావాటిని భవిష్యత్ అవసరాల కోసం నిర్మించారు. కన్నెపల్లి పంప్‌ హౌజ్‌ వాటర్ డెలివరీ పాయింట్ వద్ద 2 టీఎంసీల నీళ్లు నిలువ ఉండేలా డిజైన్ చేశారు.

ఈ కాలువగుండా గోదారమ్మ 14.85 కిలోమీటర్లు దూరం ప్రయాణించి అన్యారం బ్యారేజీ దగ్గర తిరిగి గోదావరి నదిలో కలుస్తాయి. అంటే గోదావరి నీటిని తిరిగి గోదావరి నదిలో కలుపడం అన్నమాట. కాళేశ్వరం ఎత్తిపోథల పథకంలో ఇది రెండో అతిపెద్ద బ్యారేజీ.1270 మీటర్ల వెడల్పు,119 మీటర్ల ఎత్తు,30 మీటర్ల లోఉతతో 66 గెట్లతో 10.87 టీఎంసీల నీళ్లు,32 కిలో మీటర్ల మేర నిలిచి ఉండేలా నిర్మాణం చేపట్టారు. వరద తాకిడి పెరిగినా తట్టుకునేలా ముందు జాగ్రత్తగా గోదావరి నదికి రెండు వైపులా రెండు కరకట్టలు కట్టారు.

Image result for kaleshwaram medigadda

అన్నారం దగ్గర 32 కిలోమీటర్ల వెనుకకు నిలిచి ఉన్న గోదావరి నీళ్లను సుందిళ్ల బ్యారేజ్‌కు ముందుకున్న 2.50 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా గుంజెపడగ దగ్గర నిర్మించిన అన్నారం పంప్ హౌజ్‌లోకి తరలిస్తారు. అన్నారం నుండి గ్రావిటీ కెనాల్ ద్వారా వచ్చిన గోదావరి నీళ్లను నలభై మెగావాట్ల సామర్థ్యమున్న ఎనమిది మోటార్లతో ఎత్తి సుందిళ్ల బ్యారెజ్‌లోకి పంప్ చేస్తారు.

సుందిళ్ల బ్యారేజ్ కాళేశ్వరం ఎత్తిపోథల పథకంలో నిర్మితమవుతున్న మూడో బ్యారేజ్‌.130 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో 8.83 టీఎంసీల నీటి నిల్వకోసం నిర్మిస్తున్న ఈ బ్యారేజ్‌కు 74 గేట్లను అమర్చారు. మేడిగడ్డ,అన్నారం నుండి సుందిళ్లకు వచ్చిన నీళ్లు అప్రోచ్ ఛానల్ ద్వారా 2.21 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గోళివాడలో ఉన్న సుందిళ్ల పంప్‌ హౌజ్‌కు చేరుకుంటాయి.

సుందిళ్ల పంప్‌హౌజ్‌ను 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 11 భారీ మోటార్లతో ఎత్తి ప్రెషర్ మెయిన్స్ ద్వారా ఎల్లంపల్లి రిజర్వాయర్‌కి కనెక్ట్ అయి ఉన్న 0.88 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్‌లోకి డెలివరీ చేస్తారు. ఇక్కడి నుండి గోదారమ్మ తిరిగి మళ్లీ ఎల్లంపల్లి బ్యారేజ్‌కి దగ్గర్లో గోదావరి నదిలో కలిసిపోతుంది.

ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి నిలువ సామర్ధ్యం 20.175 టీఎంసీలు.మేడిగడ్డ నుండి అన్నారంకు,అన్నారం నుండి సుందిళ్లకు,సుందిళ్ల నుండి ఎల్లంపల్లికి గోదావరి నీళ్లను వ్యతిరేఖ దశలో కాలువలు,పంప్‌హౌజ్‌ల ద్వారా తీసుకొచ్చి తిరిగి గోదావరి నదిలోనే కలుపుతూ 110 కిలోమీటర్ల పొడవునా గోదావరి నదిని సజీవంగా ఉంచుతారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుండి కాళేశ్వరం ప్రాజెక్టు రెండో లింక్ స్టార్ట్ అవుతుంది. రెండున్నర కిలోమీటర్ల అప్రోచ్ ఛానల్ ద్వారా ఎల్లంపల్లి బ్యాక్ వాటర్,గ్రావిటీ కెనాల్‌ చేరుకుని అక్కడి నుండి 1.10 కిలోమీటర్లు ప్రయాణించి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మొదటగా వచ్చే ఆరో ప్యాకేజ్‌లోని రెండు సొరంగమార్గాలకు వెళ్తాయి.ఒక్కొ టీఎంసీ సామర్థ్యంతో లెప్ట్‌,రైట్ టెన్నెల్స్‌ ద్వారా 9.534 కిలోమీటర్లు వెళ్లే ఈ ట్విన్ టన్నెల్స్‌ సొరంగమార్గంలోనే నిర్మితమైన ప్రపంచంలోనే అతిపెద్దదైన సర్జిపూల్‌ని చేరుకుని గోదావరి నీటిని అందులో పోస్తాయి.

Image result for kaleshwaram medigadda

ప్యాకేజ్ నెంబర్ సిక్స్‌లో రెండు ట్విన్ టన్నెల్స్ ద్వారా వచ్చిన రెండు టీఎంసీల నీటిని స్టోర్ చేసుకునేలా సర్జిపూల్‌ని నిర్మించారు. సర్జిపూల్ అంటే చిన్నసైజు రిజర్వాయర్‌.ఈ ఆరో ప్యాకేజ్‌లో 124 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏడు మోటార్లను బిగించారు.

ఇక్కడినుండి నందిమేడారంలోని బాలెన్సింగ్ రిజార్వయర్‌లో వాటర్ స్టోర్ అవుతాయి. దీని సామర్థ్యం 0.75 టీఎంసీలు.1.950 కిలోమీటర్ల అప్రోచ్ ఛానల్ ద్వారా ప్యాకేజ్ నెంబర్ 7కు గోదారమ్మ ప్రవహిస్తుంది. ప్యాకేజీ నెంబర్ 7లోని ట్విన్ టన్నెల్స్‌ 11.27 కిలోమీటర్లుండే జంట సొరంగాల ద్వారా డైరెక్టుగా ప్యాకేజీ 8లోకి వెళ్తాయి. ప్యాకేజీ నెంబర్ 8లో 4.133 కిలోమీటర్లు ప్రయాణించిన నీళ్లు అక్కడున్న సర్జ్‌పూల్‌లో కలుస్తాయి. ప్యాకేజీ 8లో ఆరున్నర కిలోమీటర్ల 14 చిన్న చిన్న ఆడిట్ టన్నెల్స్‌ సొరంగాలను తవ్వారు. ప్రపంచంలోనే అతిపెద్ద,అత్యంత పొడవైన అండర్ గ్రౌండ్ పంప్ హౌజ్‌ ఈ ప్యాకేజ్‌లోనే ఉంది.

కాళేశ్వరం ఎనమిదో ప్యాకేజ్ సర్జ్‌ పూల్. 375 మీటర్ల పొడవు,20 మీటర్ల వెడల్పున్న ఈ సర్జ్‌పూల్‌ కెపాసిటి 6 లక్షల 40 వేల క్యూబిక్ మీటర్లు. 139 మెగావాట్ల సామర్థ్యం గల ఏడు బాహుబలి మోటార్లతో నీటిని 169 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేసి 5.7 కిలోమీటర్ల పొడవున్న గ్రావిటీకెనాల్‌లో పోస్తారు. ఇలా విడుదలైన నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా శ్రీరామ్ సాగర్ వరదకాల్వలోకి తరలిస్తారు. అక్కడి నుండి మిడ్‌ మానేరు రిజర్వాయర్‌లో గోదావరి నీళ్లు కలుస్తాయి. దీంతో 365 రోజులు మిడ్ మానేరు నీటితో కళకళలాడనుంది. ఈ రిజర్వాయర్ సామర్థ్యం 25.875 టీఎంసీలు. మిడ్ మానేరు బ్యాక్ వాటర్ నుండి రెండో కాలువ ద్వారా గోదావరి జలాలు పదో ప్యాకేజీలోని అనంతగిరి రిజర్వాయర్‌కి, అక్కడి నుండి పదకొండో ప్యాకేజీలోని రంగనాయక సాగర్‌కి అక్కడి నుండి పన్నెండో ప్యాకేజీలో ఉన్న కాళేశ్వరం రెండో జంక్షన్ పాయింట్ అయిన మల్లన్న సాగర్‌కి చేరుకుంటాయి.

కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానంగా ఉండే రెండు జంక్షన్ పాయింట్‌లు ఒకటి మిడ్ మానేరు కాగా మరొకటి మల్లన్న సాగర్‌. దీని సామర్థ్యం 50 టీఎంసీలు. సొరంగమార్గం ద్వారా వచ్చిన గోదారి నీళ్లను రెండు సమాంతర గ్రావిటీ కాలువల ద్వారా యాదాద్రి జిల్లాలోని గంధమల్ల జలాశయానికి, అక్కడి నుండి బస్వాపూర్ రిజర్వాయర్‌కి వెళ్తాయి.

Image result for kaleshwaram medigadda

మల్లన్న సాగర్‌ సమాంతర కాల్వలోని ఒక కాలువ సింగూరు జలాశయానికి నీళ్లు తీసుకెళ్తే మరో సమాంతర కాలువ నుండి ఇంకో కాలువ పాములపర్తి దగ్గరున్న కొండపోచమ్మ సాగర్‌కు గోదావరి జలాలను తీసుకెళ్తాయి. దీని సామర్ద్యం 15 టీఎంసీలు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇక్కడి నుండే నీళ్లు రానున్నాయి.

కాళేశ్వరం ఎత్తిపోథల పథకంలో వచ్చే ఎడో లింక్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి మొదలవుతుంది. శ్రీరాంసాగర్ కుడివైపున ఉన్న అప్రోచ్ కాలువ ద్వారా గోదావరి నీళ్లు 20,21,22 ప్యాకేజీలకు వెళ్తాయి. కామారెడ్డి జిల్లాలోని భూంపల్లి రిజార్వాయర్‌కు నీళ్లు వెళ్తాయి. అలాగే ప్యాకేజీ 27 కింద శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుండి నిర్మల్‌ నియోజకవర్గంలోని దిలావర్ పూర్‌ దాకా,ప్యాకేజీ 28 కింద ముథోల్ నియోజకవర్గంలోని హంగారా వరకు గోదారి నీళ్లు వెళ్లనున్నాయి. మొత్తంగా తెలంగాణ ప్రజల నీటి,ఆహార భ్రదతనిచ్చే కాళేశ్వరం తెలంగాణ సమాజానికి వరప్రదాయనే.

- Advertisement -