రివ్యూ: ‘జెర్సీ’

184
Jersey Movie Review

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘జెర్సీ’ భారీ అంచనాలతో ఈ రోజు విడుదలైంది.. ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి రూపొందించాడు. క్రికెట్ నేపథ్యంలో మిగతా భాషలతో పోలిస్తే తెలుగులో వచ్చిన సినిమాలు తక్కువేనని చెప్పవచ్చు. క్రికెట్‌కు ఉన్న ఆకర్షణను ఉపయోగించుకునే ప్రయత్నం తెలుగు హీరోలెవరూ ఇప్పటివరకు చేయలేదు. తొలిసారి హీరో నాని జెర్సీతో ఈ దిశగా అడుగు వేశాడు. కథాంశాలు, పాత్రల పరంగా కొత్తదనం కోసం ప్రయత్నించే నాని కెరీర్‌లో తొలిసారి స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్ కథను ఎంచుకొని చేసిని సినిమా ఇది. ఈ చిత్రం మొదట్నుంచి ఆసక్తిర ప్రోమోలతో ఆకట్టుకుంటూ వస్తోంది. మరి ‘జెర్సీ’ ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం.

కథ:

అర్జున్(నాని) ఓ క్రికెటర్.. సారా(శ్రద్ధా శ్రీనాథ్‌)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఎంత బాగా ఆడినా జాతీయ జట్టులో స్థానం రాకపోవడంతో 26 ఏళ్ల వయసులోనే క్రికెట్కి దూరం అవుతాడు. స్పోర్ట్స్ కోటాలో వచ్చిన జాబ్ కూడా పోతుంది. మరోపక్క సారా జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. వీరిద్దరికీ ఓ కొడుకు(నాని) పుడతాడు. నాని తన పుట్టిన రోజున అర్జున్‌ను జెర్సీ గిఫ్ట్‌గా అడుగుతాడు. ఐదొందల రూపాయల జెర్సీని కొనేందుకు అర్జున్ చేయని ప్రయత్నమంటూ ఉండదు. ఇదే సమయంలో అర్జున్‌కు.. సారాకు మధ్య చిన్న చిన్న గొడవలు అవుతాయి. తన కొడుకు అడిగిన జెర్సీ కొనిపెట్టలేకపోయానన్న కసితో చివరికి తాను వదిలేసిన క్రికెట్‌ను మళ్లీ మొదలెడతాడు. 36 ఏళ్ల వయసులో మళ్లీ జాతీయ క్రికెట్ జట్టులో స్థానం కోసం రంగంలోకి దిగుతాడు. మరి అర్జున్‌ ప్రయత్నం సఫలమైందా… తన కొడుకు నాని ఆనందం కోసం అర్జున్ ఏం చేశాడు అన్నదే కథ!

ప్లస్ పాయింట్స్‌ :
నాని నటన
తండ్రీ కొడుకు ఎమోషన్‌
క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు
సాంకేతిక విభాగం

మైనస్ పాయింట్స్ :

సినిమాలో ప్రి క్లైమాక్స్ దగ్గర గ్రాఫ్ కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. పదేళ్లు ఆటకు దూరంగా ఉండి.. 36 ఏళ్ల వయసులో పునరాగమనం చేసిన హీరోకు ఆటలో పెద్ద అడ్డంకులేమీ ఉండవు. మరీ అతడికి ఎదురే లేదన్నట్లు చూపించడం నాటకీయంగా అనిపిస్తుంది. చాలా వరకు రియలిస్టిగ్గా సినిమాను నడిపించే ప్రయత్నం చేసిన గౌతమ్.. ఈ విషయంలో మాత్రం నిరాశ పరిచాడు. పైగా రంజీ మ్యాచ్ లు డే/నైట్లో జరుగుతున్నట్లు చూపించడం కూడా అథెంటిసిటీని దెబ్బ తీసింది. మామూలుగా చూస్తే ఇదేమంత పెద్ద విషయం కాదు కానీ.. ముందు నుంచి చాలా రియలిస్టిగ్గా.. అథెంటిగ్గా కనిపించడం వల్ల ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల.. స్లో నరేషన్.. మాత్రమే ‘జెర్సీ’లో చెప్పుకోదగ్గ మైనస్‌లు.

సాంకేతికవర్గం:

కథలోని భావోద్వేగాల్ని అర్థం చేసుకుని సంగీతం సమకూర్చే మ్యూజిక్ డైరెక్టర్.. సినిమాటోగ్రాఫర్ దొరికితే ఔట్ పుట్ ఎలా ఉంటుందో ‘జెర్సీ’లో చూడొచ్చు. అనిరుధ్ రవిచందర్ సంగీతం.. సాను వర్గీస్ ఛాయాగ్రహణం గురించి ఎంత చెప్పినా తక్కువే. అవి రెండూ కూడా వేరుగా అనిపించకుండా సినిమాలో మిక్స్ అయిపోవడం ‘జెర్సీ’ ప్రత్యేకత. అనిరుధ్ పాటలు అన్నీ బాగున్నాయి. పాటలు పాటల్లా కాకుండా బ్యాగ్రౌండ్ స్కోర్ లాగా సినిమాలో కలిసిపోయాయి. ఇక నేపథ్య సంగీతం అయితే సినిమాకు పెద్ద డ్రైవింగ్ ఫోర్స్ లాగా పని చేసింది. సాను ఛాయాగ్రహణం ఒక వింటేజ్ క్లాసిక్ మూవీ చూస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చింది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. నిర్మాతలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ద్వితీయార్ధంలో కొన్ని మ్యాచ్ దృశ్యాల దగ్గర మాత్రం కొంత రాజీ పడ్డారు. మిగతా ఎక్కడా వేలెత్తి చూపడానికి లేదు. రచయిత దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తాను చాలా కాలం ఇండస్ట్రీలో ఉంటానని ‘జెర్సీ’తో చాటి చెప్పాడు. రైటింగ్.. డైరెక్షన్ రెండింట్లోనూ అతను గొప్ప స్థాయిని చూపించాడు. ‘జెర్సీ’ని ఒక అంతర్జాతీయ స్థాయి సినిమాలా అతను తీర్చిదిద్దాడు.

తీర్పు:

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు అలవాటుపడిన తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతిని పంచే చిత్రమిది. క్రికెట్ ఆటను ఇష్టపడే ప్రేక్షకుల్ని ఈ సినిమా తప్పకుండా మెప్పిస్తుంది.‘జెర్సీ’ ఓ మంచి తండ్రి కథ. ప్రతీ ఒక్కరూ ఈ జెర్సీ.. తొడుక్కుని చూడాల్సిందే.

విడుదల తేదీ:19/04/2019
రేటింగ్ 3.25/5

నటీనటులు: నాని – శ్రద్ధ శ్రీనాథ్ – సత్యరాజ్ – మాస్టర్ రోనిత్.
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: సాను వర్గీస్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన – దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి