ఆడకున్నా అతడే టాప్..!

264
IPL 2018 KKR vs KXIP
- Advertisement -

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు తిరుగులేని విజయం! ఓపెనర్లు గేల్‌, రాహుల్‌ చెలరేగడంతో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో కోల్‌కతాను చిత్తు చేసింది. శనివారం మొదట బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌.. క్రిస్‌ లిన్‌ (74; 41 బంతుల్లో 6×4, 4×6) రాణించడంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగుల భారీ స్కోరు చేసింది. వర్షం కారణంగా కుదించిన లక్ష్యాన్ని (13 ఓవర్లలో 125) పంజాబ్‌ 11.1 ఓవర్లలో ఒక్క వికెట్టే కోల్పోయి ఛేదించింది.

అయితే ఐపీఎల్‌ వేలంలో చివరి నిమిషంలో అమ్ముడుపోయి, ఆపై జరిగిన రెండు మ్యాచులకు రిజర్వు బెంచ్‌కే పరిమితమైన విండీస్ విధ్వంసకర ఆటగాడు, కింగ్స్ ఎలెవన్ జట్టు ఓపెనర్ క్రిస్ గేల్ తానెంత స్పెషలో మరోసారి చాటిచెప్పాడు. గత సీజన్‌లో ఫెయిలయ్యాడన్న అపనమ్మకమో, ఏమో కానీ ఐపీఎల్‌లో భాగంగా జరిగిన తొలి రెండు మ్యాచులకు పంజాబ్ జట్టు గేల్‌ను దూరం పెట్టింది.

IPL 2018 KKR vs KXIP

మొహాలీలో 15న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్‌కు ఆడే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్‌లో 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేసిన గేల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 19న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ శివాలెత్తిపోయాడు. 63 బంతుల్లో 11 సిక్సర్లు, ఒకే ఒక్క ఫోర్‌తో అజేయ సెంచరీ (104) చేసి తానేంటో మరోసారి నిరూపించాడు. ఇక తాజాగా శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ మరోసారి రెచ్చిపోయాడు. 38 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు.

ఆడిన మూడు మ్యాచుల్లోనూ 50కిపైగా పరుగులు చేసిన గేల్ మొత్తం 229 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి రెండు మ్యాచ్‌లు ఆడకున్నా పరుగుల వేటలో మాత్రం గేల్ ముందుండడం విశేషం. అంతేకాదు, మూడు మ్యాచుల్లో రెండింటిలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కించుకున్నాడు. అలాగే ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 21 సిక్సర్లు బాదిన గేల్ ఈ విషయంలోనూ ముందున్నాడు.

IPL 2018 KKR vs KXIP

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: లిన్‌ (సి) రాహుల్‌ (బి) టై 74; నరైన్‌ (సి) నాయర్‌ (బి) ముజీబ్‌ 1; ఉతప్ప (సి) నరైన్‌ (బి) అశ్విన్‌ 34; రాణా రనౌట్‌ 3; కార్తీక్‌ (సి) టై (బి) శరణ్‌ 43; రసెల్‌ (సి) నాయర్‌ (బి) శరణ్‌ 10; శుభ్‌మన్‌ నాటౌట్‌ 14; కురన్‌ (సి) రాజ్‌పుత్‌ (బి) టై 1; చావ్లా నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 191;

వికెట్ల పతనం: 1-6, 2-78, 3-85, 4-147, 5-159, 6-185; 7-186 బౌలింగ్‌: రాజ్‌పుత్‌ 3-0-32-0; ముజీబ్‌ 4-0-32-1; శరణ్‌ 4-0-50-2; టై 4-0-30-2; అశ్విన్‌ 4-0-33-1; యువరాజ్‌ 1-0-13-0

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌: రాహుల్‌ (సి) కురన్‌ (బి) నరైన్‌ 60; గేల్‌ నాటౌట్‌ 62; మయాంక్‌ అగర్వాల్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం: (11.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 126;

వికెట్ల పతనం: 1-116; బౌలింగ్‌: శివం మావి 3-0-29-0; రసెల్‌ 1.5-0-31-0; రాణా 0.1-0-0-0; నరైన్‌ 3-0-23-1; చావ్లా 2-0-24-0; కుల్‌దీప్‌ 1-0-13-0; కురన్‌ 0.1-0-6-0.

- Advertisement -