భారత జోరు.. విండీస్ బేజారు..

199
- Advertisement -

వెస్టిండీస్ బౌలర్లను ఆటాడుకున్నారు టీమిండియా బ్యాట్స్‌మన్. ఏకంగా ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 649 పరుగుల భారీ స్కోరు దగ్గర ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రాజ్ కోట్‌లో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ పూర్తిగా చేతులెత్తేసింది. బౌలింగ్ లోనే కాకుండా, బ్యాటింగ్‌లో కూడా విండీస్ ఆటగాళ్లు విఫలమయ్యారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 6 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో మరో 555 పరుగులు వెనకబడి ఉంది.

విండీస్ ఇన్నింగ్స్‌ను ఆదిలోనే మొహమ్మద్ షమీ దెబ్బతీశాడు. 2 పరుగుల వద్ద ఓపెనర్ బ్రాత్ వైట్ ను, 7 పరుగుల వద్ద మరో ఓపెనర్ పావెల్ ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కూడా విండీస్ ఇన్నింగ్స్ ఎక్కడా కుదుటపడలేదు. వచ్చినవారు వచ్చినట్టే పెవిలియన్ చేరారు. విండీస్ బ్యాట్స్ మెన్లలో బ్రాత్ వైట్ 2, పావెల్ 1, హోప్ 10, హెట్మర్ 10, అంబ్రిస్ 12, డౌరిచ్ 10 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఛేస్ 27, పాల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. భారత బౌలర్లలో షమీ 2, అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్‌లు చెరో వికెట్ తీశారు. ఒకరు రనౌట్ అయ్యారు.

India vs West Indies

రెండోరోజు, శుక్రవారం ఓవర్‌నైట్‌ స్కోరు 364/4తో టీమిండియా బ్యాటింగ్‌ ఆరంభించింది. 72 పరుగులతో ఉన్న విరాట్‌ కోహ్లీ (139; 230 బంతుల్లో 10×4) సమయోచితంగా ఆడాడు. కెరీర్‌లో 24వ శతకం బాదేశాడు. సచిన్‌ 124 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధిస్తే విరాట్‌ 123 ఇన్నింగ్స్‌లే తీసుకోవడం గమనార్హం. 17 పరుగులతో బ్యాటింగ్‌ ఆరంభించిన యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ (92; 84 బంతుల్లో 8×4, 4×6) చెలరేగి ఆడాడు.

తనదైన శైలిలో భారీ బౌండరీలు, సిక్సర్లతో కనువిందు చేశాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యం అందించారు. బిషూ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన పంత్‌ జట్టు స్కోరు 470 వద్ద ఔటయ్యాడు. కోహ్లీ సైతం బిషూ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (100 నాటౌట్‌; 132 బంతుల్లో 5×4, 5×6) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. తన 56వ ఇన్నింగ్స్‌లో తొలి శతకం బాదేశాడు. చక్కని సిక్సర్లతో అలరించాడు. అతడి శతకం పూర్తికాగానే 649/9 వద్ద కోహ్లీ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశాడు.

- Advertisement -