ఇండిపెండెన్స్‌ డే:’రణరంగం’లో గెలిచేది ‘ఎవరు’…?

419
ranarangam

ఆగస్టు 15న ప్రేక్షకులకు కిక్ ఇచ్చేందుకు రెడీ అయింది టాలీవుడ్‌. అగ్రహీరోలు సినిమా టైటిల్,టీజర్‌,ట్రైలర్‌లతో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేందుకు సిద్ధమవగా హీరోలు శర్వానంద్,అడవి శేష్ బాక్సాఫీస్ వద్ద వార్‌కు సిద్దమయ్యారు. శర్వానంద్ రణరంగంతో వస్తుండగా అడవి శేషు..ఎవరు అంటూ బాక్సాఫీస్‌ని షేక్ చేసేందుకు సిద్ధమయ్యారు.

సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్,కాజల్,కళ్యాణి ప్రియదర్శి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం రణరంగం. కెరీర్‌లో తొలిసారి గ్యాంగ్‌స్టర్ పాత్రలో శర్వా కనిపించనుండగా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌ నిర్మించింది. భిన్నమైన భావోద్వేగాలు,కధ, కధనాలతో టీజర్,ట్రైలర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేశాడు శర్వా. ఇక సినిమా ప్రమోషన్‌లో భాగంగా రామ్‌చరణ్‌,నితిన్ వంటి హీరోలను ఉపయోగించి మరింత హైప్ క్రియేట్ చేశాడు.

ఇక టాలీవుడ్ హీరో అడవి శేష్, నవీన్ చంద్ర, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎవరు’. మిస్టరీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో అడవి శేష్ అవినీతిపరుడైన పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో నరాలు తెగే ఉత్కంఠను క్రియేట్ చేశాడు దర్శకుడు రామ్‌ జీ. ఆద్యంతం ఉత్కంఠగా సాగే కథ, కథనాలతో సినిమా తెరకెక్కినట్లు అర్ధమవుతోంది. మొత్తంగా ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగే రణరంగంలో గెలిచేది ఎవరు…?బాక్సాఫీస్‌ను కొల్లగొట్టే హీరో ఎవరా అన్నది తెలియాలంటే వేచిచూడాల్సిందే.