స్వ‌చ్చ భార‌త్ మిష‌న్ లో స్వ‌చ్చ న‌గ‌రంగా హైదరాబాద్

417
GHMC
- Advertisement -

స్వ‌చ్చ భార‌త్ మిష‌న్ లో హైద‌రాబాద్ న‌గ‌రాన్ని దేశంలోనే స్వ‌చ్చ న‌గ‌రంగా తీర్చిదిద్ద‌డానికి పారిశుధ్య కార్మికులదే ప్ర‌ధాన పాత్ర అని జాతీయ స‌ఫాయి క‌ర్మ‌చారి క‌మీష‌న్ ఛైర్మ‌న్ మ‌న్హ‌ర్ వాల్జిభాయ్ జాలా అన్నారు. అమీర్ పేట్‌లోని ధ‌రంక‌రం రోడ్డులో నేడు ఉద‌యం ర‌హ‌దారుల‌ను శుభ్ర‌ప‌రిచి స‌మీపంలో ఉన్న ప‌బ్లిక్ టాయిలెట్ నిర్వ‌హ‌ణ‌ను త‌నిఖీ చేశారు. క‌మీష‌న్ స‌భ్యులు జ‌గ‌దీష్ హీర‌మ‌ణి, జోన‌ల్ క‌మిష‌న‌ర్ ముషార‌ఫ్ అలీ, క‌మీష‌న్ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ‌దాస్‌లు కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ వాల్జిభాయ్ మాట్లాడుతూ దేశాన్ని సైనికులు ఏవిధంగా అయితే ప‌రిర‌క్షిస్తున్నారో అదేవిధంగా హైద‌రాబాద్ న‌గ‌ర పౌరుల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌లో స‌ఫాయి కార్మికుల సేవ‌లు శ్లాఘ‌నీయ‌మ‌ని అభినందించారు.

ప‌ర్యావ‌ర‌ణానికి పెనుముప్పుగా ప‌రిణ‌మించిన ప్లాస్టిక్ క్యారీబ్యాగ్‌లు, వ‌స్తువుల వినియోగాన్ని పూర్తిగా నిషేదించాల‌ని పిలుపునిచ్చారు. సంపూర్ణ పారిశుధ్య సాధ‌న‌కై ప్ర‌ధాన మంత్రి ప్రారంభించిన స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ ద్వారా ఉన్న‌త ఫ‌లితాలు ల‌భించాయని, ఇదే స్ఫూర్తితో ప్ర‌తిఒక్క‌రూ ప్లాస్టిక్ నిషేధాన్ని కూడా పాటించాల‌ని అన్నారు. క‌మీష‌న్ స‌భ్యులు జ‌గ‌దీష్ హీర‌మ‌ణి మాట్లాడుతూ దేశంలో మాన్వువ‌ల్ స్కావెంజింగ్ నుండి యాంత్రికర‌ణను చేప‌ట్ట‌డానికి చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు తెలిపారు. దేశంలో సీవ‌రేజ్ నాలాల ద్వారా జ‌రిగే మ‌ర‌ణాల‌ను త‌గ్గించేందుకు ప‌క‌డ్బందీ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను సూచించామ‌ని అన్నారు.

గ‌తంలో మాన్వువ‌ల్ స్కావెజింగ్ పై ఆధార‌ప‌డ్డవారికి పున‌రావాసం క‌ల్పించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆదేశించామ‌ని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా జిహెచ్ఎంసి పారిశుధ్య కార్మికుల‌తో క‌లిసి క‌మీష‌న్ ఛైర్మ‌న్‌, స‌భ్యులు అమీర్‌పేట్ ప్ర‌ధాన ర‌హ‌దారిలో చెత్త‌ను తొల‌గించారు. జిహెచ్ఎంసి ద్వారా సేఫ్టీ కిట్లు, కార్మికుల‌కు వైద్య చికిత్స‌లు అందుతున్నాయా అని కార్మికుల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం స‌మీపంలో వాల్మీకి సంఘం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ప‌బ్లిక్ టాయిలెట్‌ను త‌నిఖీ చేశారు.

- Advertisement -