కరోనా వైరస్.. హైదరాబాద్‌‌లో అలర్ట్

170
shamshabad airport

చైనాను వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ నేపథ్యంలో భారత్‌లో అలర్ట్ ప్రకటించారు. దేశంలోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి చైనా, హాంగ్ కాంగ్, థాయిలాండ్ నుంచి వస్తున్న ప్రయాణికులను క్షణ్నంగా తనిఖీ చేస్తున్నారు.

ప్రయాణికులు విమానం దిగిన వెంటనే నేరుగా తనిఖీ కేంద్రాల్లోకి తీసుకెళ్లే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలు బయటపడితే నేరుగా నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రికి తరలించి రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.

సౌదీ అరేబియాలోని ఏ1 హయత్ ఆస్పత్రిలో పని చేస్తున్న కేరళకు చెందిన ఓ నర్సులో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించారు. దీంతో కేరళలోని నర్సుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్.. కేంద్రానికి లేఖ రాశారు. సౌదీలో ఉన్న కేరళ నర్సులకు సరైన చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

చైనాలోని ఊహాన్‌ నగరంలో తొలిసారిగా కరోనా వైరస్‌ బయటపడింది. ఇప్పుడు మరో రెండు నగరాలకు ఇది పాకినట్లు చైనా మీడియా వర్గాలు వెల్లడించాయి. చైనాలో ఇప్పటికే ఈ వైరస్‌ కారణంగా 17 మంది మరణించారు. ప్రాణాంతక వైరస్ బారిన పడి 500 వందల మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.