హుజుర్‌నగర్‌….టీఆర్ఎస్‌ గెలుపుకు కారణాలివే..!

583
ktr saidireddy
- Advertisement -

కాంగ్రెస్ కంచుకోటకు బీటలు వారాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం వెరసీ హస్తం నేతల చెంపచెల్లుమనే తీర్పునిచ్చారు హుజుర్‌ నగర్ ప్రజలు. కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధికి ఓటేస్తూ టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించారు. కారు జోరుకు హస్తం పార్టీ కుదేలవ్వగా కమలం వాడిపోయింది…సైకిల్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది.

కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి గెలుపు కోసం విబేధాలను పక్కనబెట్టి కాంగ్రెస్ నేతలంతా ఏకమైనప్పటికీ ఫలితం లేకపోయింది. ఓవైపు ఆర్టీసీ సమ్మె, మరోవైపు నియోజకవర్గంపై ఉత్తమ్ కుటుంబానికి ఉన్న పట్టుతో తమ గెలుపు ఖాయమనేనని కాంగ్రెస్ భావించింది. కానీ కారు జోరు ముందు హస్తం నిలువలేకపోయింది.

కేటీఆర్ ఎన్నికల ప్రచారం,ఎన్నికల వ్యూహాల రూపకల్పన, క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై త్వరగా అవగాహనకు రావడం, సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం దీనికి తోడు సీఎం కేసీఆర్‌పై ప్రజలకు ఉన్న నమ్మకం గులాబీ పార్టీ గెలుపుకు దోహదపడింది. కేసీఆర్ పథకాల ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనిపించింది.

గతంలో ఎన్నడూ లేని రీతిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా 70 మంది నాయకులకు బాధ్యతలను అప్పగించింది. దీనికి తోడు గత ఎన్నికల్లో సైదిరెడ్డి ఓడిపోయిన సానుభూతి కూడా టీఆర్ఎస్‌కు కలిసొచ్చింది. కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కుటుంబం బాగుపడుతుందని టీఆర్ఎస్ గెలిస్తే హుజుర్‌ నగర్‌ అభివృద్ధి జరుగుతుందని మంత్రులంతా ప్రచారం చేయడంతో కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ధికి దూరం అవుతామని ప్రజలు భావించారు. ఈ ఒక్కసారి సైదిరెడ్డి అవకాశం ఇచ్చి చూద్దాం అనుకున్నారు. దీంతో ఏకపక్షంగా టీఆర్ఎస్‌కు విజయాన్ని కట్టబెట్టారు.

- Advertisement -