ఎఫ్‌బీఐ నా కొంప‌ముంచింది….

213
- Advertisement -

ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో ఈమెయిళ్ల వ్య‌వ‌హారాన్ని ఎఫ్‌బీఐ మ‌ళ్లీ బ‌య‌ట‌పెట్ట‌డం వ‌ల్లే తాను ఓట‌మికి గురైన‌ట్లు డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున పోటీచేసిన హిల్ల‌రీ క్లింట‌న్ అన్నారు. ఈమెయిళ్ల వ్య‌వ‌హారంపై పున‌ర్ విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు ఎఫ్‌బీఐ డైర‌క్ట‌ర్ జేమ్స్ కామే చేసిన ప్ర‌క‌ట‌న వ‌ల్లే త‌మ ప్ర‌చారం బ‌ల‌హీన‌ప‌డిపోయింద‌ని హిల్ల‌రీ అభిప్రాయపడ్డారు. ఒబామా ప్ర‌భుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్న హిల్ల‌రీ త‌న ప్రైవేట్ స‌ర్వ‌ర్ ద్వారా ఈమెయిళ్లను పంపినట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. డెమోక్ర‌టిక్ పార్టీకి విరాళాలు అందించిన బ‌డా వ్య‌క్తుల‌తో నిర్వహించిన కాన్ఫరెన్స్ లో హిల్ల‌రీ మాట్లాడుతున్న సంభాష‌ణ మీడియాకు లీక్ కావ‌డంతో ఈ విష‌యం వెల్ల‌డైంది.

HILLARY CLINTON

అమెరికా అధ్యక్ష బరిలో నిలిచి, ఫేవరేట్‌గా ఉండి అనూహ్యంగా ఓడిన హిల్లరీ క్లింటన్ ఫలితాల అనంతరం తన మద్దతుదారులను ఉద్దేశించి.. మొదట నవ్వుతూ మాట్లాడి, ఆ తరువాత ఉద్వేగంగా మాట్లాడారు. ఫలితాలు విడుదలైన తర్వాత భర్త బిల్ క్లింటన్‌, కూతురు చెల్సియా క్లింటన్‌, ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్‌ కైన్‌లతో కలసి హిల్లరీ క్లింటన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

HILLARY CLINTON

మీడియాతో మాట్లాడిన ఆమె అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అని, అధికార మార్పును తన మద్దతుదారులంతా శాంతియుతంగా ఆహ్వానించాలని కోరారు. ఇప్పటికీ అమెరికా పట్ల తనకు నమ్మకముందని, ఎప్పటికీ ఉంటుందన్నారు. మీకు కూడా అదే విధంగా నమ్మకముంటే ఫలితాలను అంగీకరించి, భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు. మీరు ఎంత నిరాశ చెందారో తనకు తెలుసునని, తాను కూడా అంతే నిరాశ చెందానన్నారు. ఓటమి తనను బాధిస్తోందని అయినప్పటికీ అమెరికా అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని హిల్లరీ అన్నారు. ఓటమిని అంగీకరిస్తూ పలుమార్లు ఉద్వేగానికి గురయ్యారు హిల్లరీ క్లింటన్. మ‌రోవైపు ట్రంప్ ఎన్నిక‌కు వ్య‌తిరేకంగా అమెరికాలో నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి.

- Advertisement -