సీజనల్ వ్యాధుల నివారణపై మంత్రుల సమీక్ష..

524
etela
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో దోమల నివారణకు స్ర్పేయింగ్ చేయడం, అన్ని ప్రధాన ఆసుపత్రులు, అర్బన్ హెల్త్ సెంటర్లలో ఈవినింగ్ క్లీనిక్ ల ఏర్పాటు, ఈ నెలన్నర పాటు వైద్య అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు, విస్తృత పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణను చేపట్టాలని గ్రేటర్ హైదరాబాద్‌లో అంటు వ్యాధుల నివారణపై జిహెచ్ఎంసి కార్యాలయంలో నేడు జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, హోం శాఖ మంత్రి మహ్మూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి సి.హెచ్ మల్లారెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎష్.లోకేష్ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

etela

ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ఆందోళన చెందేవిధంగా అంటు వ్యాధులు లేవని, ప్రతి వర్షకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులే ఉన్నాయని స్పష్టం చేశారు. 2017 సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత సీజన్‌లో డెంగ్యు వ్యాధి అతితక్కువగా ఉందని స్పష్టం చేశారు. అయినప్పటికీ సీజనల్ వ్యాధుల నివారణకు గాను ఇప్పటికే చేపట్టిన పలు చర్యలతో పాటు నగరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో దోమల నివారణ మందును ప్రత్యేకంగా స్ప్రేయింగ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లోనూ దోమల నివారణ మందును ఆయా యాజమన్యాల సహకారంతో చేపట్టాలని ఈటెల తెలిపారు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి సారిగా నగరంలోని ప్రధాన ఆసుపత్రులైన ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆసుపత్రులతో పాటు 95 అర్బన్ హెల్త్ సెంటర్లను సాయంత్రవేళ క్లీనిక్ లను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఒక్క కోరంటి ఫీవర్ ఆసుపత్రిలోనే జ్వర బాధితులకు వెంటనే పరీక్షలు నిర్వహించడానికి 25 కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

నగరంతో పాటు నగర శివారు మున్సిపాలిటీలలో మురికివాడలు, స్లమ్ లు, బస్తీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలని, సిబ్బంది కొరత ఉంటే తాత్కాలికంగా నియమించేందకు అనుమతి ఇవ్వనున్నట్టు ఈటెల రాజేందర్ తెలిపారు. తగు భవన సౌకర్యాన్ని కల్పిస్తే అర్బన్ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. ఇటీవల కాలంలో వరుస వర్షాల వల్ల దోమల ఉదృతి పెరగకుండా అదనంగా ఫాగింగ్, స్ప్రేయింగ్ లను చేపట్టాలని ఎంటమాలజి విభాగాన్ని ఆదేశించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాలు గార్బేజ్ డంప్ యార్డ్ లుగా మారాయని, ఆయా ఖాళీ స్థలాల్లో ఉండే గార్బేజ్ ను తొలగించే బాధ్యత ఆయా యజమానులదేనని స్పష్టం చేశారు.

నగరంతో పాటు నగర శివారులలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ల సహకారంతో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సీజనల్ వ్యాధులపై పత్రికల్లో వచ్చే వార్తలపై స్పందించి తగు వివరణలు ఇవ్వాలని పేర్కొన్నారు. అంటు వ్యాధుల నివారణకు జిహెచ్ఎంసి, వైద్య ఆరోగ్య శాఖ, జలమండలి తదితర సంబంధిత శాఖలు మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఈటెల అన్నారు. దోమలు, అంటు వ్యాధుల నివారణ కేవలం ప్రభుత్వ యంత్రాంగంతోనే విజయవంతం కాదని, స్థానిక ప్రజలు, కాలనీ సంక్షేమ సంఘాలు, బస్తీ కమిటీల భాగస్వామ్యంతోనే విజయవంతం అవుతాయని అన్నారు.

హోం మంత్రి మహ్మూద్ అలీ మాట్లాడుతూ.. నగరంలో ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులలో ఉన్న గార్బేజ్ ను తొలగించాలని కోరారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సి.హెచ్.మల్లారెడ్డి మాట్లాడుతూ.. నగరంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ల సహకారంతో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ లో వైరల్ ఫీవర్లు అధికంగా ఉన్న వాడలు, బస్తీలు, కాలనీల్లో తగు నివారణ చర్యలు చేపట్టడంతో పాటు ఆయా కార్యక్రమాలను స్వయంగా మానిటరింగ్ చేయడానికి సంబంధిత డిప్యూటి, జోనల్ కమిషనర్లు విధిగా పర్యటించాలని కోరారు. జ్వరాలతో నగరవాసులు ఏవిధమైన ఆందోళన చెందాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు.

జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ.. అంటు వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు, డెంగ్యు, మలేరియా కేసులు నిర్థారణ అయిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఫాగింగ్, స్ప్రేయింగ్ చేపట్టడం, తిరిగి రాకుండా దీర్ఘకాలిక చర్యలను చేపట్టడం అనే త్రిముఖ వ్యూహంతో గ్రేటర్ హైదరాబాద్ లో వెళుతున్నామని స్పష్టం చేశారు. నగరంలోని స్వయం సహాయక బృందాల సభ్యుల సహకారం కూడా ఈ సీజనల్ వ్యాధుల నివారణకు స్వీకరిస్తున్నామని తెలిపారు. నగరంలోని ఆసుపత్రులు, అర్బన్ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానల్లో సరిపడ మందులు, సిబ్బంది ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటించాలని కోరుతూ జిహెచ్ఎంసి రూపొందించిన కరపత్రాన్ని మంత్రులు ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్లు హరిచందన, శృతిఓజా, సందీప్ జా, సిక్తాపట్నాయక్, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, జోనల్ కమిషనర్లు ఎస్.శ్రీనివాస్ రెడ్డి, శంకరయ్య, మమత, కె.శ్రీనివాస్ రెడ్డి, ఇ.ఎన్.సి సురేష్ కుమార్, జలమండలి ఇ.డి సత్యనారాయణ, డిప్యూటి కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు, ఎంటమాలజి అధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల వైద్య అధికారులు, నగర శివారు మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు.

- Advertisement -