సీఎం కేసీఆర్‌కు టీఎస్ ఐఐసీ అరుదైన కానుక..

306
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం నగర శివార్లలోని దండు మల్కాపూర్ ఎంఎస్ఎస్ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య(టిఐఎఫ్) ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టిఐఎఫ్ అధ్యక్షుడు కే సుధీర్ రెడ్డి సారధ్యంలో పారిశ్రామికవేత్తలతో కలిసి హరితహారాన్ని విజయవంతం కోసం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీఎస్ ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎండీ ఈ వెంకట నర్సింహారెడ్డి, సీఈవో మధుసూదన్, టిఐఎఫ్ అధ్యక్షుడు సుధీర్ రెడ్డి పారిశ్రామికవేత్తలతో కలిసి ఇండస్ట్రియల్ పార్కులో మొక్కలు నాటారు.

Harithaharam

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే కేకును టీఎస్ ఐఐసీ చైర్మన్ బాలమల్లు కట్ చేసారు. కార్యక్రమంలో టీఎస్ ఐఐసీ చైర్మన్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ అంటే ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా, సంతోషంగా ఉండటమేనన్నారు. అందుకే హరిత తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అడవులను పెంపొందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్టంలో కోట్ల సంఖ్యలు మొక్కలు నాటి అందులో 95 శాతం రక్షించుకోవడం జరిగిందన్నారు. హరిత తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ 66వ పుట్టినరోజు సందర్భంగా టీఎస్ ఐఐసీ ఆధ్వర్యంలో మూడు రోజుల్లో 1.32 లక్షల మొక్కలను రాష్ట్రంలోని అన్ని పారిశ్రామిక పార్కుల్లో నాటుతున్నట్లు చెప్పారు.

Harithaharam 1

పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో పెట్టిన ప్రతి మొక్కను బతికించుకునేందుకు సంరక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలను నాటి వాటిని కాపాడుకునేందుకు భాధ్యత తీసుకోవాలని టీఎస్ ఐఐసీ చైర్మన్ బాలమల్లు పిలుపునిచ్చారు. టీఎస్ ఐఐసీ ఎండి నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మానసపుత్రిక ఆయిన హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నందన్నారు. టీఎస్ ఐఐసీ హరిత తెలంగాణ సాధనలో ముందు భాగాన ఉంటుందని చెప్పారు. టిఐఎఫ్ అధ్యక్షుడు కే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా టిఐఎఫ్ తరపున దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో పెద్ద ఎత్తున మొక్కలను నాటుతున్నామని వెల్లడించారు.

Harithaharam 2

మంత్రి కేటీఆర్ కోరుకున్నట్టుగా దండుమల్కాపూర్ ఎంఎస్ ఎం ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఇప్పటి వరకు రూ.20 లక్షల వ్యయంతో పెద్ద ఎత్తున మొక్కలను నాటడం, ఇతర గ్రీనరి పనులను చేపట్టామని సుధీర్ రెడ్డి వివరించారు. కార్యక్రమంలో టీఎస్ ఐఐసీ సీఈవో మధుసూదన్, టిఐఎఫ్ ప్రధాన కార్యదర్శి గోపాల్ రావు, కార్యవర్గ సభ్యులు గోవింద్ రెడ్డి, టిఎస్ ఐఐసీ జోనల్ మేనేజర్ శారదా, డిజిఎం విఠల్, టిఆర్ఎస్ నాయకులు సస్య రవి, గుడాల భాస్కర్, ఇతర పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

- Advertisement -