చంద్రబాబుపై మంత్రి హరీష్ రావు ఫైర్

218
chandra babu
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబుపై ఫైరయ్యారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మట్లాడిన హరీష్‌..ఏపీలో రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఎందుకు నెరవేర్చలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్,టీడీపీకి విశ్వసనీయత లేదన్నారు. ప్రజలంతా కేసీఆర్ వైపే ఉన్నారని స్పష్టం చేశారు.

ఏపీలో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు వాటిని మాఫీ చేయకపోవడంతో మహిళలందరూ అప్పుల ఊబిలోకి కూరుకుపోయారని ఆరోపించారు. 2014లో భారతీయ జనతా పార్టీతో పొత్తు చారిత్రక అవసరమని ఇప్పుడేమో కాంగ్రెస్‌తో పొత్తు చారిత్రక అవసరమని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లు మోడీతో కలిసి ఉన్నప్పుడు లౌకికవాదం ఎక్కడికిపోయిందని
ప్రశ్నించారు.

తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నది వాస్తవం కాదా అన్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ఆపాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయలేదా అని ప్రశ్నించారు. ప్రాణహిత- చేవెళ్లకు 2007లో కాంగ్రెస్‌ ప్రభుత్వం జీవో ఇచ్చింది. 16 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు ప్రాణహిత- చేవెళ్లను చేపట్టారు. మేం అధికారంలోకి వచ్చాక ఆయకట్టును 37 లక్షల ఎకరాలకు పెంచామని తెలిపారు. సముద్రంలో కలిసే నీళ్లను వాడుకునేందుకు కాళేశ్వరం చేపడితే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు మొసలి కన్నీళ్లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.

- Advertisement -