హార్దిక్‌ చెంప చెల్లుమనిపించిన ఆగంతకుడు..

269
Hardik Patel
- Advertisement -

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ నేత హార్దిక్‌ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. లోక్‌స‌భ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా గుజరాత్‌లోని సురేందర్‌న‌గ‌ర్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో హార్దిక్ పటేల్ మాట్లాడుతుండ‌గా.. ఒక్కసారిగా ఓ వ్యక్తి మైక్‌ వద్దకు వచ్చి ఆయన చెంప చెల్లుమనిపించాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్క‌సారిగా అవాక్కవగా, కాంగ్రెస్ కార్యకర్తలు సదరు వ్యక్తిని పట్టుకుని చిత‌క‌బాదారు. అనంతరం పోలీసులకు పట్టించారు.

పోలీసులు దాడి చేసిన వ్యక్తిని ప్రశ్నించగా.. హార్దిక్‌ కాంగ్రెస్‌లో చేరినందుకే తాను కొట్టానని అన్నాడు. పటేల్‌ ఆందోళనలో 14 మంది మృతికి హార్దిక్‌ పటేల్‌ బాధ్యత వహించాలన్నాడు. అయితే దాడి చేసిన వ్యక్తి వివరాలు మాత్రం తెలియరాలేదు. ఘటన అనంతరం హార్దిక్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు. తనను భయపెట్టడానికి భాజపానే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అయ్యింది.

- Advertisement -