కుర్రాళ్ల దెబ్బకు గుజరాత్ ఔట్‌..

200
- Advertisement -

ఫిరోజ్‌ షాకోట్లా మైదానంలో గుజరాత్‌ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ డేర్‌డెవిల్స్‌ బ్యాట్స్‌మెన్లు విధ్వంసం సృష్టించారు. ఈ దెబ్బకు ప్లేఆఫ్‌ రేసు నుంచి గుజరాత్‌ ఔట్‌ కాగా.. దిల్లీ అలవోకగా ఛేదించి ప్లేఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. రిషబ్‌ పంత్‌ (97; 43 బంతుల్లో 6×4, 9×6), సంజు శాంసన్‌ (61; 31 బంతుల్లో 7×6) కళ్లుచెదిరేలా బ్యాటింగ్‌ చేయడంతో గురువారం దిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్‌ లయన్స్‌ను మట్టికరిపించింది. శాంసన్‌, పంత్‌ మెరవడంతో లక్ష్యాన్ని దిల్లీ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఎనిమిదో పరాజయం చవిచూసిన గుజరాత్‌ కథ ఈ టోర్నీలో ముగిసిపోయింది.

pant

209 పరుగుల లక్ష్యంతో చేదనకు దిగిన మూడో ఓవర్లో దిల్లీ ఓపెనర్‌ నాయర్‌ (12) ఔట్‌ కావడంతో పంత్‌కు శాంసన్‌ తోడయ్యాడు. సంజు, పంత్‌ ఇద్దరూ ముచ్చటైన షాట్లతో బంతులను స్టాండ్స్‌లోకి పంపుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. పది ఓవర్లకు స్కోరు 113/1. 11వ ఓవర్లో విధ్వంసం పరాకాష్టకు చేరుకుంది. ఫాల్క్‌నర్‌ వేసిన ఆ ఓవర్లో పంత్‌ ఫోర్‌, మూడు సిక్సర్లు బాదేశాడు. వెంటనే జడేజాకు శాంసన్‌ రెండుసార్లు చుక్కలు చూపించాడు. 14వ ఓవర్లో సంజు ఔట్‌ కావడంతో 143 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. అయినా పంత్‌ జోరు తగ్గలేదు. ఓ సిక్స్‌, ఫోర్‌తో శతకానికి చేరువయ్యాడు. కానీ శతకానికి మూడు పరుగుల దూరంలో థంపి (15వ ఓవర్‌) బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అప్పటికి స్కోరు 179. సాధించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువగా ఏమీ లేకపోవడంతో దిల్లీకి కంగారు పడాల్సిన అవసరం లేకపోయింది. అండర్సన్‌ (18 నాటౌట్‌; 12 బంతుల్లో 2×6), శ్రేయస్‌ అయ్యర్‌ (14 నాటౌట్‌; 8 బంతుల్లో 2×6) స్కోరు వేగాన్ని కొనసాగిస్తూ అలవోకగా పని పూర్తి చేశారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌.. జట్టు స్కోరు 10 వద్ద ఓపెనర్లు స్మిత్‌(9), మెక్‌కలమ్‌(1) వికెట్లను కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రైనా రన్‌రేట్‌ 9కి తగ్గకుండా స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నాడు. 32 బంతులాడిన రైనా 4ఫోర్లు, 2సిక్సర్ల సాయంతో అర్ధశతకం సాధించాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో రైనాకు ఇది 31వ ఆఫ్‌సెంచరీ కావడం విశేషం. మరో ఎండ్‌లో దినేశ్‌ కార్తిక్‌ కూడా దూకుడుగా ఆడి ఆర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. రబాడా విసిరిన అద్బుత బంతి రైనా (77) రనౌట్ అయ్యాడు..15వ ఓవర్‌ తొలి బంతికి కార్తీక్‌ను కమిన్స్‌ ఔట్‌ చేశాక.. గుజరాత్‌ ఇన్నింగ్స్‌ వేగాన్ని కోల్పోయింది. ఫించ్‌ (27; 19 బంతుల్లో 4×4) కాస్త రాణించినా బౌండరీలు ఎక్కువగా రాలేదు. ఐతే చివరి రెండు బంతులకు జడేజా (18 నాటౌట్‌; 7 బంతుల్లో 2×6) సిక్స్‌లు కొట్టడంతో స్కోరు 200 దాటింది.

- Advertisement -