3 కోట్ల మొక్కల చేరువలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌..

284
Green India Challenge

హరిత జగతి కోసం పిలుపునిచ్చిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఉద్యమ రూపు దాల్చింది. ఇతింతై వటుడింతైనట్లు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రతి మనిషి తన జీవిత కాలానికి కావాల్సిన ప్రాణవాయువు పొందాలంటే కనీసం మూడు మొక్కలు నాటాలన్న శాస్త్రీయ సందేశం అందరినీ ఆలోచింప చేస్తోంది. ఆబాల గోపాలం మొక్కలు నాటేలా ప్రేరేపిస్తోంది.వాడవాడలా వి‌స్తరిస్తున్న గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ప్రస్తుతం 3 కోట్ల మొక్కలకు చేరువైంది. వన హారతికి మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒకరికొకరు సవాలు విసురుకుంటూ మొక్కలు నాటుతున్నారు.

తాము నాటిన మొక్కలతో సెల్ఫీలు తీసుకొని సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నందున ఆ దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటికే పచ్చదన యోధులు పద్మశ్రీ జాదవ్‌ పయెంగ్‌, పద్మశ్రీ వనజీవి రామయ్య, కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జవడేకర్‌, హర్షవర్ధన్‌, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, సినీ తారలు చిరంజీవి, నాగార్జున, రాజకీయ ప్రముఖులు కేటీఆర్‌, ప్రముఖ క్రీడాకారులు, సచిన్‌ టెండ్కూలర్, వీవీఎస్‌ లక్ష్మణ్‌… పుల్లెల గోపీచంద్‌, కిదాంబి శ్రీకాంత్‌, పీవీ సింధు, సానియా మీర్జా, సైనా నెహ్వాల్‌, ద్యుతిచంద్‌, సిక్కిరెడ్డి తదితరులు మొక్కలు నాటి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కి ఊపు తెచ్చారు.

ఇటీవల తెరాస రాజ్యసభ ఎంపీ సంతోష్‌ కుమార్‌ సవాలుకి ఎంతోమంది రాజకీయ నేతలు స్పందించి మొక్కలు నాటి ఇతరులకి ఛాలెంజ్‌ ఇచ్చారని ఇగ్నైటింగ్‌ మైండ్స్‌ ఫౌండర్‌, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ సృష్టికర్త ఎం. కరుణాకర్‌రెడ్డి చెప్పారు. అందరి కృషితో త్వరలో 10 కోట్ల మొక్కలకి చేరువవుతామని విశ్వాసం వ్యక్తం చేశారు.

రాజ్య సభ సభ్యులు జె. సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో మొదలైన ఈ కార్యక్రమం ముఖ్య మంత్రి ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ మొదటి మొక్క నాటారు, ఒక కోటి మొక్కను పురపాకల శాఖ మంత్రి కేటీఆర్,రెండవ కోటి మొక్క ను రాజ్య సబ సభ్యులు జె. సంతోష్ కుమార్ నాటారు, తాజాగా భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌రావు…. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి, భాజపా శాసనసభ్యుడు రాజాసింగ్‌, భాజపా ఎమ్మెల్సీ రామచందర్‌రావు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్‌కు సవాలు విసిరారని ఒక ప్రకటనలో తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, హరిత విశ్వం, మానవ భవిత కోసం తలపెట్టిన ఈ మహా క్రతువులో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.