తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది

234
governor

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో ముందుకెళ్తుందన్నారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్‌. 71వ గణతంత్రదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్జెన్ లో గవర్నర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. ముందుగా రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ , అభివృద్ధి పథకాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, రైతుబీమా, రైతుబంధు, పల్లెప్రగతి లాంటి అద్భుతమైన పథకాలను రూపొందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్‌ కొనియాడారు.

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది అని ఆమె ప్రశంసించారు. అతి తక్కువ కాలంలోనే తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కొత్త మున్సిపాలిటీ, పంచాయతీ చట్టాలను తీసుకొచ్చాం. త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం తీసుకురాబోతుందన్నారు . రెవెన్యూ చట్టం ద్వారా పారదర్శక సేవలు అందేలా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. పల్లె ప్రగతి తరహాలో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందని గవర్నర్‌ తెలిపారు. ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్స్‌ వంటి మంచి పథకాలు అమలవుతున్నాయి. హరిత తెలంగాణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్‌ స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు పాల్గోన్నారు.