అంటువ్యాధుల నివారణ చర్యలపై అధికారుల తనిఖీలు..

294

గ్రేటర్ హైదరాబాద్‌లో అంటు వ్యాధుల నివారణకై చేపట్టిన చర్యల్లో భాగంగా ఎంటమాలజి, పారిశుధ్య విభాగం ద్వారా నిర్వహిస్తున్న లార్వా నిరోధక స్ప్రేయింగ్, పెరిత్రయం, ఐ.ఆర్.ఎస్ మిశ్రమాల స్ప్రేయింగ్, డెంగ్యు పాజిటీవ్ కేసులు నమోదు అయిన ప్రాంతాల్లో చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాల అమలును జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్‌తో పాటు పలువురు సీనియర్ అధికారులు వేర్వేరుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ ఎల్బీనగర్ జోన్ లోని నాగోల్, ఉప్పల్ ప్రాంతాల్లో శానిటేషన్, ఎంటమాలజి విభాగాల ద్వారా చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించారు. అంబర్ పేట్ పటేల్ నగర్‌లో స్థానిక శాసన సభ్యులు కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ పులి జగన్‌లతో కలిసి సీజనల్ వ్యాధుల నివారణపై తీసుకోవాల్సి జాగ్రత్తలపై చైతన్య ర్యాలీ నిర్వహించారు.

జిహెచ్ఎంసి కమిషనర్ ఆదేశాలతో జిహెచ్ఎంసి పారిశుధ్య విభాగం అడిషనల్ కమిషనర్ శృతి ఓజా, జోనల్ కమిషనర్లు హరిచందన, ముషారఫ్ అలీ, ఎస్. శ్రీనివాస్ రెడ్డి, జె.శంకరయ్య, కె.శ్రీనివాస్ రెడ్డి, చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబులతో పాటు పలువురు డిప్యూటి కమిషనర్లు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. అడిషనల్ కమిషనర్ శృతిఓజా నేడు గోషామహల్, మంగళ్ హాట్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. గోషామహల్ డివిజన్ లోని జాంబాగ్‌లో డెంగ్యు నమోదు అయిన ఇళ్లను స్వయంగా పరిశీలించి ఆయా ప్రాంతాల్లో చేపట్టిన ఫాగింగ్, స్ప్రేయింగ్, శానిటేషన్ కార్యక్రమాలను పరిశీలించారు.

అనంతరం మంగళ్ హాట్‌లో డెంగ్యు పాజిటీవ్ నమోదు అయిన ఇంటిని పరిశీలించారు. ఆయా ఇళ్లలో నీటి నిల్వలను తొలగించాలని, పాత టైర్లు, ఖాళీ డబ్బాలలో నీటిని తొలగించి దోమల ఉత్పత్తి కాకుండా తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని స్థానికులకు సూచించారు.

ghmc

సికింద్రాబాద్ జోన్ లోని లాలాపేట్, లక్ష్మినగర్ ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ శంకరయ్య చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు, సికింద్రాబాద్,బేగంపేట్‌ సర్కిల్ ఎఎమ్ఓహెచ్ రవిందర్ గౌడ్, ఎన్విరాన్మెంట్ స్పెషలీస్ట్‌లు యమున,తేజశ్రీ పలువురు అధికారులు లార్వా నివారణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న చర్యలను పరిశీలించారు. అదేవిధంగా బర్కత్ పుర, అంబర్‌పేట్‌లలో నమోదు అయిన డెంగ్యు పాజిటీవ్ కేసుల ఇళ్లను,వాటి పరిసరాలను మెడికల్ ఆఫీసర్లు పర్యటించి డ్రైనేజిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు,దోమల ఉత్పత్తికి అనువుగా ఉన్న ప్రాంతాల్లో ఎంటమాలజి విభాగం ద్వారా స్ప్రేయింగ్ ను చేపట్టారు.

అంబర్‌పేట్‌లో శానిటేషన్ కార్యక్రమాల నిర్వహణపై ఇంటింటి తనిఖీకి వెళ్లిన జిహెచ్ఎంసి అధికారులకు విస్తుపోయే సంఘటనలు ఎదురయ్యాయి. అంబర్ పేట్‌లో కేవలం రెండు చిన్న గదుల్లో దాదాపు 20మంది యువకులు అపరిశుభ్రంగా నివసిస్తూ,వ్యర్థాలను రూం పక్కనే వేయడంతో అవి దోమల ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలుగా తయ్యారు కావడాన్ని అంబర్ పేట్ డిప్యూటి కమిషనర్ కృష్ణయ్య,మెడికల్ ఆఫీసర్ హేమలతలు చూసి విస్తుపోయారు. ఎంటమాలజి,పారిశుధ్య సిబ్బందిని వెంటనే పిలిపించి ఆయా ప్రాంతాల్లో స్ప్రేయింగ్ నిర్వహించి వ్యర్థాలను తొలగించారు.

పటాన్ చెరు జి.పి కాలనీ, అంబేడ్కర్ నగర్, వివేకానందనగర్ తదితర కాలనీలలో ఇంటింటికి తిరిగి సీజనల్ వ్యాధులపై చైతన్యం కల్పించారు. రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పర్ పల్లి,గాంధీనగర్ లలో డెంగ్యు పాజిటీవ్ నమోదు అయిన ప్రాంతాల్లో స్ప్రేయింగ్,పారిశుధ్యం, చైతన్య కార్యక్రమాలను చేపట్టారు.

ముషిరాబాద్ సర్కిల్ లోని కవాడిగూడలో ఇంటింటి తనిఖీలకు వెళ్లిన డిప్యూటి కమిషనర్,మెడికల్ అధికారులకు ఒక ఇంటిలో దాదాపు 40కి పైగా ఖాళీ పాత్రలు, శానిటరి కుండీలలో నీటి నిల్వలు ఉండి దోమల ఉత్పత్తి కావడాన్ని గమనించారు. వెంటనే ఈ నీటిని తొలగించి లార్వా నిరోధక మందును చల్లి, ఆ ఇంటి యజమానిని తీవ్రంగా మందలించారు. నగరంలోని అన్ని డిప్యూటి కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు తమ పరిధిలోని అంటువ్యాధుల ప్రభావిత ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు.