వృద్దాప్య పించ‌న్లకై వారంలోగా ముసాయిదా జాబిత- దాన‌కిషోర్‌

392
- Advertisement -

రాష్ట్ర ప్ర‌భుత్వం వృద్దాప్య పించ‌న్ల మంజూరుకు ల‌బ్దిదారుల ఎంపిక‌కై హైద‌రాబాద్ జిల్లాలో 57 ఏళ్ల నుండి 64 సంవ‌త్స‌రాల లోపు వ్య‌క్తుల ముసాయిదా జాబితాను ఈ నెల 25వ తేదీలోపు పూర్తిచేయాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ ఆదేశించారు. సాఫ్ – షాన్‌దార్ హైద‌రాబాద్, ఆస్తిప‌న్ను సేక‌ర‌ణ‌, 57 సంవ‌త్స‌రాలు పైబ‌డ్డ వారి వివ‌రాల సేక‌ర‌ణ‌, స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ త‌దిత‌ర అంశాల‌పై నేడు జీహెచ్ఎంసీ జోన‌ల్‌, డిప్యూటి క‌మిష‌న‌ర్లు, మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, యు.సి.డి ప్రోగ్రాం అధికారులు, రెవెన్యూ అధికారులతో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు శృతిఓజా, సిక్తాప‌ట్నాయ‌క్‌, అద్వైత్ కుమార్ సింగ్‌, జోన‌ల్ క‌మిష‌న‌ర్లు హ‌రిచంద‌న‌, ముషార‌ఫ్ అలీ, ర‌ఘుప్ర‌సాద్‌, శ్రీ‌నివాస్‌రెడ్డి, హైద‌రాబాద్ జాయింట్ క‌లెక్ట‌ర్ జి.ర‌వి త‌దిత‌రులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

ghmc

ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ మాట్లాడుతూ.. 2018 నవంబ‌ర్ మాసంలో ప్ర‌క‌టించిన ఎన్నిక‌ల తుది జాబితాను అనుస‌రించి హైద‌రాబాద్ జిల్లాలో 57 సంవ‌త్స‌రాల పైబ‌డ్డవారి వివ‌రాల జాబితాను రూపొందిస్తున్నామ‌ని తెలిపారు. న‌గ‌ర ప్రాంతాల్లో 2ల‌క్ష‌ల వార్షిక ఆదాయం క‌లిగి ఏవిధ‌మైన స్థిర ఆస్తి లేకుండా గ‌తంలో పించ‌ను పొంద‌ని ల‌బ్దిదారుల జాబితాను 25వ తేదీలోగా రూపొందించాల‌ని డిప్యూటి క‌మిష‌న‌ర్లను ఆదేశించారు. బి.ఎల్‌.ఓల చే ఇంటింటి స‌ర్వేను చేప‌ట్టాల‌ని, ఈ స‌ర్వే సంద‌ర్భంగా ప్రాథ‌మికంగా అర్హులుగా ఉన్న‌వారి ఆధార్ నెంబ‌ర్ల‌ను విధిగా సేక‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు. 57ఏళ్ల నుండి 64 సంవ‌త్స‌రాల లోపు ఉన్న‌వారి జాబితాను సేక‌రించి వారికి గ‌తంలో వృద్దాప్య పించ‌న్లు గాని, మ‌రే ఇర‌త పించ‌న్లు గానీ పొందుతున్న వివ‌రాల‌ను స‌కుటుంబ స‌ర్వే, అందుబాటులో ఉన్న ఇత‌ర స‌మాచారంతో అనుసంధానం చేసి అన‌ర్హుల‌ను వేరు చేయాల‌ని సూచించారు. ఇందుకుగాను డిప్యూటి క‌మిష‌న‌ర్లు సంబంధిత రెవెన్యూ అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని సూచించారు. హైద‌రాబాద్ జిల్లాలో ఉన్న 3,979 పోలింగ్ కేంద్రాల వారిగా 57సంవ‌త్స‌రాల‌కు పైబ‌డ్డ ఓట‌ర్ల జాబితాను అందించామ‌ని, ఈ జాబితా ప్రాతిప‌దిక‌పై ఎంపిక‌చేయాల‌ని తెలిపారు.

క‌మ‌ర్షియ‌ల్ భ‌వ‌నాల ఆస్తిప‌న్ను పున‌ర్‌మూల్యాంక‌ణానికి స్పెష‌ల్ డ్రైవ్‌..

జీహెచ్ఎంసీ ప‌రిధిలో వెయ్యి గ‌జాల స్థ‌లం క‌న్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న హోట‌ళ్లు, షాపింగ్‌ మాల్స్‌, మ‌ల్టీఫ్లెక్స్, ఫంక్ష‌న్‌హాళ్లు, ప్రైవేట్ పాఠ‌శాల‌లు త‌దిత‌ర క‌మ‌ర్షియ‌ల్ భ‌వ‌నాల త‌నిఖీల‌ను చేప‌ట్టేందుకు ప్ర‌త్యేక టాస్క్‌పోర్స్ బృందాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ ప్ర‌క‌టించారు. న‌గ‌రంలోని క‌మ‌ర్షియ‌ల్ భ‌వ‌నాల్లో అనుమ‌తి పొందినవాటిక‌న్నా అధికంగా నిర్మాణాలు చేప‌ట్టార‌ని, భ‌వ‌నాల ఆస్తిప‌న్ను నిర్థార‌ణ‌లోనూ తీవ్ర వ్య‌త్యాసాలు ఉన్నాయ‌ని ప‌లు ఫిర్యాదులు అందాయ‌ని, ఈ నేప‌థ్యంలో ఈ క‌మ‌ర్షియ‌ల్ భ‌వ‌నాల‌న్నింటిపై మ‌రోసారి త‌నిఖీలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించామ‌ని తెలిపారు. ఇందుకుగాను టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ, ఇంజ‌నీరింగ్ విభాగాల అధికారులచే ఒక్కో జోన్‌కు ప్ర‌త్యేకంగా ఒక‌ టాస్క్‌పోర్స్‌ను ఏర్పాటు చేసి త‌నిఖీలు నిర్వ‌హించ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. ఒక జోన్ అధికారులు ఇత‌ర జోన్‌ల‌లో క‌మ‌ర్షియ‌ల్ భ‌వ‌నాల‌ను త‌నిఖీ చేస్తార‌ని, వీటిని జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలోని సెంట్ర‌ల్ టాస్క్‌పోర్స్ ప‌ర్య‌వేక్షిస్తుంద‌ని పేర్కొన్నారు. ఈ త‌నిఖీల‌ను సంబంధిత జోన‌ల్ క‌మిష‌న‌ర్లు, జోన‌ల్ సిటీ ప్లాన‌ర్లు, డిప్యూటి క‌మిష‌న‌ర్లు కూడా ప్ర‌త్య‌క్షంగా చేప‌ట్టాల‌ని స్ప‌ష్టం చేశారు. అనుమ‌తులు పొందిన వాటిక‌న్నా భారీ స్థాయిలో వ్య‌త్యాసంతో నిర్మాణాలు ఉన్న క‌మ‌ర్షియ‌ల్ భ‌వనాలు, ఆస్తిప‌న్ను చెల్లింపులోనూ భారీ వ్య‌త్యాసం ఉన్న భ‌వ‌నాల య‌జ‌మానుల‌పై అవ‌స‌ర‌మైతే కేసులు న‌మోదు చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ త‌నిఖీలు ఏవిధ‌మైన వివాదాల‌కు తావులేకుండా పార‌ద‌ర్శ‌కంగా చేప‌ట్టాల‌ని దాన‌కిషోర్ అన్నారు.

జూలై నెల ఆస్తిప‌న్ను సేక‌ర‌ణ ల‌క్ష్యం రూ. 123 కోట్లు..

ప్ర‌స్తుత 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 1800 కోట్ల‌ను ఆస్తిప‌న్నుగా సేక‌రించాల‌నే ల‌క్ష్యానికిగాను ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 714 కోట్ల‌ను సేక‌రించిన‌ట్టు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ తెలిపారు. గ‌త సంవ‌త్స‌రం ఇదే రోజుకు రూ. 560.39 కోట్లను ఆస్తిప‌న్నులో భాగంగా సేక‌రించామ‌ని, గ‌త సంవ‌త్స‌రాన్ని పోలిస్తే రూ. 153 కోట్లను అద‌నంగా సేక‌రించామ‌ని వివ‌రించారు. ప్ర‌స్తుత జూలై మాసంలో రూ. 123 కోట్ల‌ ఆస్తిప‌న్ను సేక‌రించాల‌నే ల‌క్ష్యంగా నిర్ణ‌యించామ‌ని, ఈ మాసంలో ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 96 కోట్లు సేక‌రించిన‌ట్టు చెప్పారు.

డ‌స్ట్‌బిన్‌ల ఏర్పాటుకు నెల‌రోజుల గ‌డువు..

న‌గ‌రంలో వ్యాపారులు, దుకాణ‌దారులు స్ట్రీట్ వెండ‌ర్లంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా డ‌స్ట్‌బిన్‌ల‌ను నెల‌రోజుల్లోగా ఏర్పాటు చేసుకోవాల‌ని క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ ఆదేశించారు. ఇప్ప‌టికే స్ట్రీట్ వెండ‌ర్లు డ‌స్ట్‌బిన్‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని కోరుతూ జీహెచ్ఎంసీ సిబ్బంది వారిని వ్య‌క్తిగ‌తంగా క‌లిసి చైత‌న్య‌ప‌ర్చ‌డం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. నెల రోజుల్లోగా డ‌స్ట్‌బిన్‌ల‌ను ఏర్పాటు చేసుకున్న‌ట్లైతే త‌దుప‌రి జ‌రిమానాలు విధించ‌డం జ‌రుగుతుంద‌ని హెచ్చ‌రించారు. వీధీ వ్యాపారుల సంక్షేమం, బ్యాంకు రుణాలు అందించ‌డం త‌దిత‌ర సంక్షేమ‌ కార్య‌క్ర‌మాల‌ను జీహెచ్ఎంసీ ద్వారా త్వ‌రలోనే చేప‌ట్టేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

4వేల మంది స్వ‌చ్ఛ ఉల్లంఘ‌నుల‌కు రూ. 56.50 ల‌క్ష‌ల జ‌రిమానాలు..

న‌గ‌రంలో పెద్ద ఎత్తున స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్న‌ప్ప‌టికీ బాద్య‌తార‌హితంగా వ్య‌వ‌హ‌రించే న‌గ‌ర‌వాసుల‌కు జ‌రిమానాలు విధించే ప్ర‌క్రియ‌ను కొన‌సాగించాల‌ని దాన‌కిషోర్ స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌గ‌రంలో 4వేల మంది స్వ‌చ్ఛ ఉల్లంఘ‌నుల‌కు రూ. 56,31,350 జ‌రిమానాలుగా విధించామ‌ని వెల్ల‌డించారు. సాఫ్‌, షాన్‌దార్ హైద‌రాబాద్ కార్య‌క్ర‌మానికి న‌గ‌ర‌వాసుల నుండి విశేష స్పంద‌న ల‌భిస్తోంద‌ని ఈ కార్య‌క్ర‌మాన్ని మ‌రింత విస్త‌రించ‌నున్న‌ట్టు క‌మిష‌న‌ర్ ప్ర‌క‌టించారు.

- Advertisement -