తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందిః వినోద్ కుమార్

514
b vinod kumar
- Advertisement -

బీజేపీకి అనుకూలంగా లేని రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందన్నారు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్. బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందన్నారు. ఏపీ, తెలంగాణలకు అసెంబ్లీ సీట్లు పెంచేదీ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటన పట్ల వినోద్ కుమార్ మండిపడ్డారు. కాశ్మీర్ కు ఏడు అసెంబ్లీ స్థానాలను పెంచి వాళ్లకో న్యాయం చేస్తూ ఏపీ, తెలంగాణ పట్ల మరో న్యాయం చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.

ఏపీ, తెలంగాణ లకు అసెంబ్లీ స్థానాలు ఎందుకు పెంచరని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. ఒకే దేశం – ఒకే చట్టం అనే నినాదం ఏమైందన్నారు. అసెంబ్లీ స్థానాల పెంపు దేశ వ్యాప్తంగా ఒకేసారి చేపడతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒకవైపు చెబుతూనే.. మరో వైపు కాశ్మీర్ లో 107 నుంచి 114 కి అసెంబ్లీ సీట్లు పెంచారన్నారు. దీన్ని తాము తప్పు పట్టడం లేదని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఆరేళ్లుగా అసెంబ్లీ స్థానాలను పెంచాలని కేంద్రాన్ని కోరుతున్నా పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో ఏపీ, తెలంగాణ ప్రజలు న్యాయస్థానంలో సవాలు చేస్తారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

- Advertisement -