తెలంగాణలో ధాన్యం సేకరణ విధానం భేష్‌:ఎఫ్‌సీఐ

27
civil corporation

తెలంగాణలో ధాన్యం సేకరణ విధానంపై భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) ప్రశంసలు గుప్పించింది. రాష్ట్రంలో ధాన్యం సేకరణ విధానం చాలా బాగుందని, రాష్ట్రంలో ప్రతి ఏడాది ధాన్యం దిగుబడులు పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు రైతులకు ఎంతో మేలు చేసే విధంగా ఉన్నాయని ఎఫ్‌సీఐ అధికారుల బృందం ప్రశంసించింది.

ఎఫ్‌సీఐ చీఫ్‌ సలహాదారు ఎస్‌.పీ. కార్‌, జనరల్‌ మేనేజర్‌, ఆపరేషన్స్‌ హేమంత్‌ జైన్‌, ఎఫ్‌సీఐ తెలంగాణ జనరల్‌ మేనేజర్‌ అశ్వినీ కుమార్‌ శుక్రవారం పౌరసరఫరాల భవన్‌లో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా తెలంగాణ రైస్‌ మిల్లర్ల దగ్గర ఉన్న 3.44 లక్షల టన్నుల రా రైస్‌ను తీసుకోవడానికి భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సంసిద్ధత వ్యక్తం చేసింది. సీఎంఆర్‌ బియ్యం ధృవీకరణలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి సేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని స్పష్టం చేసింది. ధాన్య సేకరణ, సీఎంఆర్‌ అప్పగింత, స్టోరేజ్‌ స్పేస్‌ తదితర అంశాల్లో ఎఫ్‌సీఐ నుండి తెలంగాణ ప్రభుత్వానికి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ చేసిన విజ్ఞప్తులపై ఎఫ్‌సీఐ అధికారులు సానుకూలంగా స్పందించారు.

ఈ ఏడాది ఖరీఫ్‌, రబీలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 68 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, ఇందుకు సంబంధించి 23 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఎఫ్‌సీఐ గోదాముల్లో అవసరమైన స్టోరేజ్‌ స్పేస్‌ను చూపించకపోవడంతో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సందర్భంగా కమిషనర్‌ ఎఫ్‌సీఐ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ఎఫ్‌సీఐ గోదాముల్లో రా రైస్‌, బాయిల్డ్‌ రైస్‌ నిల్వలు పేరుకుపోవడంతో కస్టం మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) ను అప్పగించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ నిల్వలను రైలు ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలించాలని కమిషనర్‌ విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎఫ్‌సీఐ అధికారులు సానుకూలంగా స్పందిస్తూ కేరళ, కర్నాటక రాష్ట్రాలకు తక్షణం బియ్యాన్ని తరలిస్తామని హామీ ఇచ్చారు.

ఖమ్మం, భూపాలపల్లి, మహబూబాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో గోదాముల సమస్య తీవ్రతపై స్పందిస్తూ జాయింట్‌ కలెక్టర్లతో చర్చించి సమస్యను తక్షణం పరిష్కారిస్తామని కూడా హామీ ఇచ్చారు. అలాగే ఆరు అక్నాలెడ్జ్‌మెంట్‌ (ఏసీకే)లకు తక్కువగా ఉన్నా కూడా మిల్లర్లకు లాట్‌ అలాట్‌మెంట్‌ కేటాయిస్తామని చెప్పారు.2017-18లో మిగిలిపోయిన కొత్త గోనె సంచుల్లో బియ్యం రవాణాకు అనుమతించే విషయంపై ఢిల్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.