రివ్యూ : ఫ్యాషన్ డిజైనర్

381
Fashion Designer movie review
- Advertisement -

రాజేంద్రప్రసాద్‌ హీరోగా నటించిన లేడిస్ టైలర్‌ చిత్రాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు తెలుగు ప్రేక్షకులు. ఆ పాత మధురం ‘లేడీస్‌ టైలర్‌’ సినిమాకి సీక్వెల్‌గా లెజెండరీ డైరెక్టర్‌ వంశీ తెరకెక్కించిన చిత్రం ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడిస్ టైలర్. సుమంత్‌ అశ్విన్‌, అనీషా ఆంబ్రోస్‌, మనాలి రాథోడ్‌, మానస తదితరులు ముఖ్యపాత్రల్లో మధుర శ్రీధర్‌ రెడ్డి నిర్మాతగా మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న వంశీ ఫ్యాషన్ డిజైనర్‌తో అలరించాడా లేదా చూద్దాం..

కథ :

లేడీస్ టైల‌ర్ సుంద‌రంగారి అబ్బాయి గోపాలం (సుమంత్ అశ్విన్‌). తండ్రిలాగే అమ్మాయిల దుస్తుల్ని కుట్ట‌డంలో ఆరితేరినోడు. ఫ్యాష‌న్ డిజైన‌ర్ అనిపించుకోవాల‌నేది అత‌డి ఆశ‌. కానీ జీవితం మాత్రం మార‌దు. ఓ జ్యోతిష్యుడి ద‌గ్గ‌రికి వెళితే చేతిలో మ‌న్మ‌థ‌రేఖ ఉంద‌ని, అమ్మాయిల మ‌న‌సు దోచేస్తావ‌ని చెబుతారు. దాంతో ఊళ్లో ధ‌న‌వంతుల‌ అమ్మాయైన గేదెల రాణి (మాన‌స హిమ‌వ‌ర్ష‌)ని ప్రేమ‌లో దించుతాడు. అంత‌లోనే ఊరికి పెద్దైన గ‌వ‌ర్రాజు మేన‌కోడ‌లు అమ్ములు (మ‌నాలి రాథోడ్‌)ని చూశాక ఆమెపైనా మ‌న‌సు పారేసుకొంటాడు. గేదెల రాణి కంటే అమ్ములుకి ఎక్కువ ఆస్తి ఉంద‌ని తెలియ‌డంతో గోపాలం ఆమెని ప్రేమిస్తాడు. ఆ త‌ర్వాత అమెరికా నుంచి మ‌హాల‌క్ష్మి(అనీషా ఆంబ్రోస్‌) ఊళ్లోకి వ‌స్తుంది. ఆమెకి ఈ ఇద్ద‌రి కంటే ఎక్కువ ఆస్తి ఉంద‌ని తెలుస్తుంది. దాంతో ఆ ఇద్ద‌రినీ వ‌ద‌లిపెట్టి మ‌హాల‌క్ష్మి చుట్టూ తిరుగుతాడు. అలా ఆ ముగ్గురి జీవితాల్లోకి ప్రవేశించిన గోపాళం ఏం చేశాడు ? వారి వలన అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ? చివరికి ఏమైంది ? అనేదే ఈ చిత్ర కథ.

Fashion Designer movie review

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ ఛాయాగ్రహణం,క్లైమాక్స్,పల్లెటూరి నేపథ్యం. మన్మథ రేఖ అనే కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని నిర్మాత మధుర శ్రీధర్ అందించిన మూల కథ బాగుంది. హీరో ఆ మన్మథ రేఖను పరీక్షించి పని చేస్తుందని నిర్ణయించుకుని దాన్ని తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకోవడం, చివరికి ఇబ్బందుల్లో పడటం అనే కథానాంశం కూడా బాగుంది. ముగ్గురు కథానాయిక‌లు ఉన్న‌ప్ప‌టికీ క‌థంతా కూడా క‌థానాయ‌కుడు సుమంత్ అశ్విన్ చుట్టూనే తిరుగుతుంది. దాదాపు ప్ర‌తి స‌న్నివేశంలోనూ ఆయ‌న క‌నిపిస్తారు. నట‌న‌ను ప్ర‌ద‌ర్శించ‌డానికి సుమంత్‌కు మంచి అవ‌కాశం దొరికింది. కథానాయికల్లో గేదెల రాణి పాత్రని పోషించిన మానస చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది.నియర్ నటుడు కృష్ణ భగవాన్ వంశీ శైలికి తగ్గట్టు నటించి తానున్న దాదాపు అన్ని సన్నివేశాల్లో కామెడీని పండించారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ కథ,కథనం,వంశీ మార్క్‌ కామెడీ లేకపోవడం. కృష్ణ భగవాన్ మినహా అందరూ చిన్నవాళ్ళే కావడం, వాళ్ళు వంశీగారి వినూత్న రీతిని అందుకోవడంలో తడబడటం వలన ఆయన శైలి ఈసారి మెప్పించలేకపోయింది. ఫస్టాఫ్, సెకండాఫ్ రెండూ కూడా సాధారణంగానే ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్, హీరో హీరోయిన్ల సన్నివేశాలు కొన్ని, క్లైమాక్స్ ఎపిసోడ్ మినహా ఏవి కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

Fashion Designer movie review

సాంకేతిక విభాగం :

సాంకేతికంగా సినిమాకి మంచి మార్కులు ప‌డ‌తాయి. మ‌ణిశ‌ర్మ సంగీతం ఆక‌ట్టుకొంటుంది. అయితే పాట‌లు మాత్రం గుర్తుపెట్టుకొనేలా లేవు. మాట‌ల మెరుపులు అక్క‌డ‌క్క‌డా బాగా వినిపిస్తాయి.సినిమాలో నగేష్ బానెల్లి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. గోదావరి అందాలను వంశీగారి షాట్ మేకింగ్ ను బాగా ప్రెజెంట్ చేశారు.ఎడిటింగ్ విభాగం కొన్ని అనవసర సన్నివేశాల్ని, ఇంకొన్ని సన్నివేశాల లెంగ్త్ ను తగ్గించి ఉండాల్సింది.మ‌ధుర శ్రీ‌ధ‌ర్‌ నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

తీర్పు:

మరోసారి ప్రేక్షకులకి మ్యాజిక్ చూపిద్దామనుకుని చేసిన ప్రయత్నంలో వంశీగారి స్టైల్ పాక్షికంగా మాత్రమే కనబడింది. కొన్ని కామెడీ సీన్లు, రొమాంటిక్ సన్నివేశాలు, క్లైమాక్స్ సీన్ సినిమాకు ప్లస్ కాగా ఆకట్టుకునే కథనం లేకపోవడం, పేలవమైన కొన్ని సన్నివేశాలు నిరుత్సాహపరిచాయి. మొత్తం మీద చెప్పాలంటే వంశీగారి శైలిని ఇష్టపడే వాళ్లకు మాత్రమే ఈ సినిమా కాస్తో కూస్తో వినోదాన్నందిస్తుంది.

విడుదల తేదీ : 02/06/ 2017
రేటింగ్ : 2.75/5
నటీనటులు : సుమంత్ అశ్విన్, అనీషా ఆంబ్రోస్, మానస హిమ వర్ష, మనాలి రాథోడ్
సంగీతం : మణిశర్మ
నిర్మాత : మధుర శ్రీధర్
దర్శకత్వం : వంశీ

- Advertisement -