ఈబిజ్ స్కాం….ఎండీ పవన్ అరెస్ట్

375
ebiz

విద్యార్థులే లక్ష్యంగా సాగిన గొలుసుకట్టు మోసాన్ని సైబరాబాద్ పోలీసులు చేధించారు. ఈబిజ్ ఎండీ పవన్ మల్హన్, ఆయన కుమారుడు హిటిక్ మల్హన్‌లను అరెస్టు చేశారు. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో చైన్ సిస్టమ్ ద్వారా ఈ బిజ్ మోసం చేసిందని బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చైన్ సిస్టమ్ ద్వారా దేశవ్యాప్తంగా రూ.5 వేల కోట్ల మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. న్యాయస్థానంలో నిందితులను హాజరుపర్చిన పోలీసులు అనంతరం చర్లపల్లి జైలుకు రిమాండ్‌కు తరలించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం నోయిడా కేంద్రంగా 18 ఏళ్లుగా ‘ఈబిజ్‌.కాం’ సంస్థ కార్యకలాపాలు సాగిస్తంది. దేశవ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమ సంస్థకు చెందిన ఈ-లెర్నింగ్‌ ప్రాజెక్టుల్లో చేరితే సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ప్రలోభపెడుతూ సభ్యుల్ని చేర్పించుకున్నారు.

హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, డిల్లీ మెట్రో నగరాలతోపాటు జమ్ము, కశ్మీర్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గోవా, తెలంగాణ రాష్ట్రాల్లో గొలుసుకట్టు మోసాన్ని సాగించారు. సంస్థలో చేరేందుకు తొలుత ఒక్కో సభ్యుడి నుంచి రూ.16,821 వసూలు చేస్తారు. సొమ్ము చెల్లించిన వెంటనే గుర్తింపు సంఖ్య కేటాయించడంతోపాటు 10 వేల పాయింట్లు కేటాయిస్తారు. తర్వాత ముగ్గురిని చేర్పిస్తే 30 వేల పాయింట్లతోపాటు 9 శాతం చొప్పున కమీషన్‌గా రూ.2,700 ఇస్తారు.

అనంతరం మరో ముగ్గురు చొప్పున సభ్యుల్ని చేర్పిస్తూ పోతే 4 శాతం చొప్పున కమీషన్‌ చెల్లిస్తారు. ఈ క్రమంలో 50 మందిని చేర్పించే వారికి రూ.25 వేలు కమీషన్‌గా అందజేస్తారు. జగిత్యాలకు చెందిన సామల్ల వివేక్‌ ఈబిజ్‌ సంస్థలో చేరాడు. రెండు నెలలైనా తన పెట్టుబడి తిరిగి రాకపోవడంతో కంగుతిన్న వివేక్‌ తనను చేర్పించిన వ్యక్తిని నిలదీశాడు. మరికొంత మందిని చేర్పిస్తేనే కమీషన్‌ వస్తుందని సదరు ప్రమోటర్‌ స్పష్టం చేయడంతో ఇది గొలుసుకట్టు మోసమని గుర్తించిన అతను సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం పోలీసుల్ని ఆశ్రయించాడు.