ప్రతీ ఇంటికి తాగునీరు..భేష్

93
rajashekar

అన్ని ఇండ్లకు ఒకే రకమైన ప్రెజర్ తో తాగునీరు అందించడమే మిషన్ భగీరథ ను ప్రత్యేకంగా నిలుపుతోందన్నారు కేంద్ర తాగునీటి సరాఫరా విభాగం డిప్యూటీ సలహాదారు రాజశేఖర్. రెండు రోజుల పాటు క్షేత్ర స్థాయిలో మిషన్ భగీరథ నీటి శుద్దికేంద్రాలు, తాగునీరు సరాఫరా అవుతున్న ఆవాసాలను పరిశీలించిన రాజశేఖర్, ఇవాళ ఎర్రమంజిల్ లోని భగీరథ కార్యాలయంలో ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ప్రాజెక్టు లక్ష్యాలను ఈ.ఎన్.సి వివరించారు.

మిషన్ భగీరథ విభాగం తయారుచేసిన ఫ్లో కంట్రోల్ వాల్వ్ లతో ప్రతీ ఇంటికి సమాన స్థాయిలో తాగునీరు సరాఫరా అవడం బాగుందన్నారు. . ఆ తర్వాత మిషన్ భగీరథ పురగోతి, తాగునీటి సరాఫరాపై కన్సల్టెంట్ నందారావు, స్కాడా ఉపయోగం పై కన్సల్టెంట్ మనోహర్ బాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాజశేఖర్ గతంలో కొన్ని రాష్ట్రాలు తాగునీటి పథకాలను ప్రారంభించినా, కొన్ని గ్రామాలకే పరిమితం అయ్యాయని చెప్పారు. కాని మిషన్ భగీరథ తో సుమారు 24 వేల గ్రామాలకు నీళ్లు అందించేందుకు ఏకకాలంలో రాష్ట్రం మొత్తం పనులు చేయడం అభినందనీయం అన్నారు.

చక్కటి సమన్వయం, పనితీరుతో పనిచేస్తున్నారని భగీరథ ఇంజనీర్లను మెచ్చుకున్నారు. భగీరథలో నిర్మించిన నీటి శుద్ది కేంద్రాలు బాగా పనిచేస్తున్నాయని చెప్పారు. ఇవే ప్రమాణాలను పాటించాలని సూచించారు. నీటి శుద్ది కేంద్రాల్లో రీసైక్లింక్ విధానంతో వృథా అయిన నీటిని తిరిగి శుద్ది చేయడం బాగుందన్నారు.

తెలంగాణ తాగునీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో ప్రారంభించిన మిషన్ భగీరథ, ఆ సంకల్పాన్ని నెరవేరుస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజనీర్ విజయపాల్ రెడ్డి, వినోభాదేవి, రమేశ్, చెన్నారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కన్సల్టెంట్లు నందారావు, మనోహర్ బాబు, నర్సింగ రావు, ఎస్.ఈ విజయ్ కుమార్, ఈఈలు అన్నపూర్ణ, రవీందర్ రెడ్డి, రాజేశ్వర్ రావు లు పాల్గొన్నారు.