తిరుమల కెళ్లాడు.. నారాయణ.. నారాయణ..!

381
CPI Narayana in Tirumala
CPI Narayana in Tirumala
- Advertisement -

సిపిఐ నేత నారాయణ స్టయిలే వేరు. ఎవరి మీద సెటైర్లు వేయాలన్నా, పంచ్‌ డైలాగులతో రెచ్చిపోవాలన్నా ఆయనకు సాటి ఇంకెవరూ రారేమో. ఒక్కోసారి ఆ పంచ్‌ డైలాగుల కోసం పడే ఆరాటం కాస్తా ఆయన్ను వివాదాల్లోకి లాగేస్తుంది. సిపిఐ నారాయణ అనడం కన్నా, ఆయన్ని చికెన్‌ నారాయణ అనడం కరక్టేమో. ఎందుకంటే ఆయనకి చికెన్‌ అంటే అంత ఇష్టం. అప్పుడెప్పుడో ఓ సారి గాంధీ జయంతి నాడు చికెన్‌ లాగించేసి, లెంపలేసుకున్నారాయన. సాధారణంగా దేవుడ్ని నమ్మని నారాయణ.. తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, తాను ఎస్ఎస్ఎల్సీ పాస్ కాగానే ఇక్కడికి వచ్చి గుండు కొట్టించుకున్నానని, ఆపై ఇదే రావడమని అన్నారు. అప్పటితో పోలిస్తే, భక్తుల సంఖ్య వందల రెట్లు పెరిగిపోయిందని చెప్పారు. చాలా కాలం తరువాత ఇక్కడికి వచ్చానని చెప్పారు. పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత బ్యాంకుల వద్ద వేల మంది పేదలు, సామాన్యులు కనిపిస్తున్నారే తప్ప ధనవంతులు ఎవరూ బ్యాంకుల వద్దకు రాలేదని విమర్శించారు. మోడీ ఆలోచన తప్పని, తొందరపాటుతో కూడుకున్నదని అన్నారు. కాగా, నిన్న నారాయణ కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని కూడా సందర్శించడం విశేషం. అయితే ఆలయాలకు వెళ్లని నారాయణ.. తన కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే తిరుమలకు వచ్చినట్టు సమాచారం.

మరోవైపు… 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడంతో… స్వామివారి దర్శనానంతరం ఇళ్లకు తిరుగు పయనమైన భక్తులు అవస్తలు పడుతున్నారు. పెద్ద నోట్లను హోటళ్లు, దుకాణాల్లో తీసుకోవడం లేదు. ఏటీఎంలు కూడా మూసివేయడంతో డబ్బులు లేని వారు తిరుగు ప్రయాణానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ టిక్కెట్ల కొనుగోలుకు పెద్దనోట్లు తీసుకుంటున్నా… చిల్లర ఇవ్వడానికి ఎక్కువ సమయం పడుతుండడంతో భక్తుల కష్టాలు రెట్టింపవుతున్నాయి.

- Advertisement -