ఇరాన్ ను కబళిస్తున్న కరోనా..!

237
Coronavirus

కరోనా అంటే చాలు.. ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. రోజురోజుకి ఈ వ్యాధి విస్తృతంగా విస్తరిస్తోంది. కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ఇప్పడు ఇరాన్‌ను కబళిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్‌ బారిన పడి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇరాన్‌ ఆరోగ్య శాఖ ఉప మంత్రి హరిర్చికి కరోనా వైరస్‌ సోకగా.. తాజాగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు మసౌమే ఎబ్తేకర్‌కు సోకడంతో ఇరాన్‌ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఆమెను సొంత నివాసంలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు ఇరాన్ పార్లమెంట్ నేషనల్ సెక్యూరిటీ హెడ్ మొజ్తబాకు కూడా ఈ మహమ్మారి సోకింది. దీంతో, తనకు తాను నిర్బంధం విధించుకున్నానని ఓ వీడియో ద్వారా ఆయన వెల్లడించారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 26 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిన్న ప్రకటించింది. కరోనా సోకిన వారి సంఖ్య 245కి చేరుకుందని… వీరిలో 106 మంది ఒక్క రోజులోనే ఈ మహమ్మారి బారిన పడ్డారని తెలిపింది.