కేజ్రీవాల్‌ జీవితం పోరాటాల మయం…

627
kejriwal
- Advertisement -

నాలుగున్నర దశాబ్దాల క్రితం..అంటే అది ఆగస్టు 16, 1968…ఆ రోజు శ్రీ కృష్ణాష్టమి. హర్యానాలోని హిస్సార్‌లో జన్మించాడు కేజ్రీవాల్. ఓ సామాన్య కుటుంబంలో పుట్టి అసమాన్యుడిగా ఎదిగారు కేజ్రీ. ఆయన జీవితం అనుక్షణం పోరాటాల మయం.అన్నా హజారేతో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత ఆర్‌టీఐ ఉద్యమం,లోక్ పాల్ పోరాటం,పరివర్తన్ అనే ఎన్‌జీఓ కార్యక్రమాల్లో తనదైన ముద్రవేసిన కేజ్రీవాల్ ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)ను ఏర్పాటుచేసి సరికొత్త రాజకీయాలకు నాంది పలికాడు.

సీఎంగా ఉన్న సామాన్యుడిగానే జీవించాడు. నేల విడిచి సాము చేయలేదు. నమ్మిన సిద్ధాంతాల కోసం ముఖ్యమంత్రి పీఠాన్ని తృణప్రాయంగా వదిలేశాడు. ఢిల్లీ ప్రజల అవసరాలను తీర్చి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేశాడు. ఫలితంగా వరుసగా మూడోసారి ఢిల్లీ పీఠంపై ఆప్ జెండాని ఎగురవేశాడు.

ఐఐటి ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్‌ చేసిన ఆయన టాటా స్టీల్‌లో మూడేళ్లు ఉద్యోగం చేశారు. అక్కడ ఆయన మనసు నిలవలేదు. ఆ ఉద్యోగాన్ని వదిలేసి సివిల్స్‌ రాశారు. ఐఆర్‌ఎస్‌ అధికారిగా కొత్త జీవితం ప్రారంభించారు. 1999లో ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తున్న రోజుల్లో, అట్టడుగు స్థాయి నుంచి అవినీతి ఎంతగా పెరిగిపోయిందో గమనించారు. ఈ అవినీతిని రూపుమాపితే తప్ప దేశం బాగుపడదని భావించారు. 2006లో కేజ్రీవాల్‌ ఐఆర్‌ఎస్‌ ఉద్యోగాన్ని వదిలేసి జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేశారు. 2012 నవంబర్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి శ్రీకారం చుట్టారు.

2013లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆప్‌ 28 స్థానాలు గెలుచుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడు సార్లు పనిచేసిన షీలా దీక్షిత్‌పై పోటీచేసి కేజ్రీవాల్‌ భారీ మెజారిటీతో గెలుపొందారు.కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో 2013 డిసెంబర్‌ 28న ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఢిల్లీ సీఎంగా సంచలనాలు సృష్టించారు. సీఎంగా ఉండి కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమించారు. జనలోక్‌పాల్‌ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్‌, బీజేపీలు ఆ బిల్లుకు అడ్డు పడడాన్ని నిరసిస్తూ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 2015 లో జరిగిన ఎన్నికల్లో ఆప్‌కు తిరుగులేని మెజార్టీని సాధించిపెట్టారు. 70 స్ధానాల్లో ఏకంగా 67 స్ధానాల్లో ఆప్ విజయకేతనం ఎగురవేసింది. తాజాగా 2020లో మూడోసారి ఆప్‌ని అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు.

పుట్టిన తేది : జననం: ఆగస్టు 16, 1968
స్వస్థలం : హర్యానాలోని హిస్సార్‌
కుటుంబం:భార్య సునీత, ఒక అబ్బాయి. ఒక అమ్మాయి.
విద్య : ఐఐటి ఖరగ్‌పూర్‌లో బిటెక్‌
అవార్డులు: రామన్‌ మెగసెసే అవార్డుతో పాలు పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు
అలవాట్లు: శాకాహారం, విపశన ధ్యానం.

- Advertisement -