యుద్ద ప్రాతిపదికన యాదాద్రి పనులు:సీఎం కేసీఆర్

520
cm kcr yadadri
- Advertisement -

యాదాద్రిలో జరుగుతున్న పనులపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం.. దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణ పనులన్నింటినీ దాదాపు రెండున్నర గంటల పాటు కాలినడకన కలియతిరిగి పరిశీలించారు. తర్వాత కొండ పైకి చేరుకొని బాలాలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణ కుంభంతో సాగతం పలకగా ప్రధాన ఆలయం పునర్నిర్మాణ పనులను, గర్భ గుడి లోపల,మాడ విధులు,ప్రకారాలు,గోపురాలు,ఆళ్వార్ల విగ్రహాలు తుది దశ పనులను పరిశీలించారు.

అనంతరం హరిత హోటల్‌లో యాడా సిబ్బంది, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. యుద్ద ప్రాతిపదకిన యాదాద్రి పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన దేవాలయం పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు 692 కోట్ల వ్యయం జరిగిందని చెప్పారు. యాదాద్రి దేవాస్థానం కొత్తగా నిర్మిస్తున్నది కాదు కాబట్టి ఎలాంటి ప్రారంభోత్సవం ఉండదన్నారు.

ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి తక్షణమే రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు యాడాకు మరో ఉన్నతాధికారిని నియమించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఫిబ్రవరి నెలలో యాదాద్రిలో మహ సుదర్శన యాగం నిర్వహించాలని తలపెట్టినందున ఈలోగానే కాటేజీల నిర్మాణం, మాళిక సదుపాయాల కల్పన పూర్తి కావాలని చెప్పారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం కొత్తగా నిర్మిస్తున్నది కాదు కాబట్టీ, ఎలాంటి ప్రారంభోత్సవం ఉండబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పునరుద్ధరణ పనులన్నీ పూర్తయిన తరువాత శాస్త్రోక్తంగా పూజలు, దర్శనాలు యధావిధిగా పాత పధ్దతిలోనే కొనసాగుతాయని చెప్పారు.

ప్రధాన ఆలయం పనుల్లో సింహభాగం పూర్తయింది. కొద్దిపాట పనులు మాత్రమే మిగిలాయి. ఆ పనుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఇకపై ఆర్ అండ్ బి శాఖామంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రతీ వారం యాదాద్రిలో పర్యటించి పనుల పురోగతిని నేరుగా పర్యవేక్షిస్తారు. ప్రధాన ఆలయం పనులతో పాటు రింగురోడ్డు నిర్మాణం, ప్రెసెడెన్షియల్ సూట్స్, కాటేజీలు, విద్యుత్ సబ్- స్టేషన్ తదితర పనులన్నీ రాబోయే రెండు మూడు నెలల్లో పూర్తి చేయాలి. టెంపుల్ సిటీలో 250 కాటేజీలు నిర్మించాలి. దీనికోసం దాదాపు 400 కోట్ల రూపాయలు విరాళాలు ఇవ్వడానికి వివిధ కార్పోరేట్ సంస్థలు, దాతలు సిద్ధంగా వున్నారు. కాబట్టీ వెంటనే కాటేజీల డిజైన్లు రూపొందించాలి. కాటేజీల నిర్మాణం ప్రారంభించాలి. భూసేకరణ త్వరగా పూర్తి చేసి ప్రధాన రహదారులన్నీ వెడల్పుగా నిర్మించాలి’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు.

ప్రధాన ఆలయమున్న గుట్టకింది భాగంలో ప్రస్తుతమున్న గండి చెరువును తెప్పోత్సవం నిర్వహించడానికి వీలుగా తీర్చిదిద్దాలి. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఈ చెరువును నింపడానికి అనువుగా కాలువ నిర్మించాలి. చెరువు కింది భాగంలో పురుషులు, మహిళలకు వేరువేరుగా కళ్యాణ కట్టలు, నీటి కొలనులు, బట్టలు మార్చుకునే గదులు ఏర్పాటు చేయాలి. గుట్ట కింది భాగంలోనే బస్టాండు, ఆటో స్టాండు, పార్కింగ్ ఫైర్ స్టేషన్, పోలీస్ ఔట్ పోస్టు, అన్నదాన సత్రాలు ఏర్పాటు చేయాలి. ఈ పనులన్నీ వెంటనే చేపట్టి త్వరగా పూర్తి చేయాలి. మైసూరు బృందావన్ గార్డెన్ లాగా తీర్చిదిద్దబోతున్న బస్వాపూర్ చెరువు ప్రాంతంలో అధునాతన హరిత రెస్టారెంట్, కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలి. పునరుద్ధరణ పనులు పూర్తయిన తరువాత బస్సుల ద్వారా భక్తులను గుట్ట పైకి చేర్చాలి. దీనికోసం గుట్టపైన బస్ బే నిర్మించాలి’’ అని ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పారు.

‘‘వచ్చే ఫిబ్రవరిలో యాదాద్రిలో మహా సుదర్శన యాగం నిర్వహించాలని భావిస్తున్నాం. 3000 మంది రుత్వికులు, 3000 మంది వేద పారాయణదారులు, మరో 3000 మంది సహాయకులు ఇందులో పాల్గొంటారు. 1048 కుండాలు ఏర్పాటు చేసి యాగం నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇతర ప్రముఖులు, 45 దేశాల నుండి వేద పండితులు, అర్చకులు, దేశ నలుమూలల నుండి ప్రతీరోజు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. వీరందరికీ కావలసిన ఏర్పాట్లు చేయాల్సి వుంటుంది’’ అని ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పారు.

‘‘ఆలయ పునరుద్ధరణ పనుల కోసం రూ. 235 కోట్లు, రహదారుల నిర్మాణం కోసం భూసేకరణ జరపడానికి 109 కోట్ల రూపాయలు, టెంపుల్ సిటీలో మౌళిక సదుపాయాల కల్పనకు 103 కోట్ల రూపాయలు వ్యయం చేసినట్లు’’ ముఖ్యమంత్రి చెప్పారు. ఆలయాభివృద్ధి, యాదగిరి గుట్ట మున్సిపాలిటీ అభివృద్ధి, టెంపుల్ సిటీ నిర్మాణం, దేవాలయ నిర్మాణం, భక్తులకు ఎర్పాట్లు తదితర పనుల కోసం ఇప్పటి వరకు 692 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు సిఎం వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, జడ్పీ చైర్ పర్సన్ సందీప్ రెడ్డి, ఎమ్మెల్సి కృష్ణారెడ్డి, కలెక్టర్ అనితా రాంచంద్రన్, వైటిడిఎ స్పేషల్ ఆఫీసర్ కిషన్ రావు, ఆలయ ఇవో గీత, ఆలయ శిల్పి ఆనంద్ సాయి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారుడు సుధాకర్ తేజ, ఆర్ అండ్ బి ఇఎన్సీలు గణపతి రెడ్డి,రవీందర్ రావు, ఎస్.పి.డి.సి.ఎల్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, సిఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -