నవ్యాంధ్రకు నవశకం:సీఎం కేసీఆర్

423
cm kcr
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవయువ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నవశకం ప్రారంభమైందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన అనంతరం మాట్లాడిన కేసీఆర్‌ తెలుగు ప్రజల జీవన గమనంలో ఇవాళ ఓ ఉజ్వలమైన ఘట్టమని అభివర్ణించారు. ఉభయ రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలంతా ప్రేమతో, అనురాగంతో, పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తుందని తాను నమ్ముతున్నట్టు తెలిపారు.

జగన్ వయసు చిన్నదని, బాధ్యత పెద్దదని తెలిపారు సీఎం కేసీఆర్. వయసు చిన్నదైనా, తండ్రి నుంచి వచ్చిన వారసత్వం ఆయన్ను ముందుకు నడిపిస్తుందని అన్నారు. జగన్ సంపూర్ణ విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇక రెండు రాష్ట్రాలూ ఖడ్గచాలనం వదిలేసి కరచాలనం చేసే రోజు ఇదని, తనకు తెలిసి జగన్ ముందున్న కర్తవ్యం గోదావరి జలాల సంపూర్ణ వినియోగమని, అది 100 శాతం జరుగుతుందన్న నమ్మకం ఉందని అన్నారు. కృష్ణా జలాల విషయంలో సమస్యలున్నా, ప్రతి నీటి చుక్కనూ వినియోగించుకుందామని, రెండు రాష్ట్రాల్లోని ప్రతి అడుగు భూమినీ సస్యశ్యామలం చేద్దామని పిలుపునిచ్చారు.

అంతకముందు నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మధ్యాహ్నం 12.23 గంటలకు సీఎంగా జగన్ ప్రమాణం చేశారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. జగన్ ప్రమాణస్వీకారోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, తమిళనాడు నుంచి డీఎంకే అధినేత స్టాలిన్‌ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు.

- Advertisement -