అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్తు-సీఎం కేసీఆర్‌

381
cm kcr
- Advertisement -

అన్ని రంగాలకు అన్ని వేళలా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడం లక్ష్యంగా దేశంలో సమగ్ర విద్యుత్ విధానం రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభిలషించారు. దేశంలో ప్రస్తుతమున్న స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో సగం కూడా ఉపయోగించుకోవడం లేదని, ఇంకా చాలా ప్రాంతాలు చీకట్లోనే మగ్గుతున్నాయని, దేశ వ్యాప్తంగా విద్యుత్ కోతలు అమలవుతున్నాయని సిఎం అన్నారు. ఈ పరిస్థితి పోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించి పవర్ ప్లాంట్లు, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పి.ఎఫ్.సి.) సిఎండి రాజీవ్ శర్మ ఆదివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేశ, రాష్ట్ర విద్యుత్ పరిస్థితిపై చర్చ జరిగింది. జెన్ కో, ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ్ రావు, కార్యదర్శులు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

CM KCR

‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు తీవ్రమైన విద్యుత్ సంక్షోభం నెలకొని ఉంది. రాష్ట్ర ప్రగతికి ఆనాడు విద్యుత్ సమస్యే తీవ్ర అవరోధంగా నిలిచింది. విద్యుత్ సమస్యను పరిష్కరించనిదే రాష్ట్ర పురోగతి సాధ్యం కాదని భావించాం. విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్దడానికి సమగ్ర వ్యూహం అనుసరించాం. ఆరు నెలల్లో విద్యుత్ కోతలు ఎత్తివేశాం. ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా అందిస్తున్నాం. 2 ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. తెలంగాణలో పరిశ్రమలు మూడు షిఫ్టులు పనిచేస్తున్నాయి. దీనివల్ల ఉపాధి పెరిగింది, రాష్ట్ర ఆదాయం పెరిగింది. లో ఓల్టేజి లేకుండా ఉండేందుకు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోకుండా ఉండేందుకు పంపిణీ, సరఫరా వ్యవస్థలను మెరుగుపరిచాం. ప్రస్తుతం 20వేల మెగావాట్ల విద్యుత్‌ను వాడుకోవడానికి అనుగుణమైన వ్యవస్థ సిద్ధమైంది’’ అని ముఖ్యమంత్రి వివరించారు.

పి.ఎఫ్.సి. సహకారం ఎంతో ఉపయోగపడింది: సిఎం కేసీఆర్

తెలంగాణలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, ఇతర విద్యుత్ సంబంధ వ్యవస్థలను తీర్చిదిద్దడానికి పి.ఎఫ్.సి. అందించిన ఆర్థిక సహకారం ఎంతో దోహదపడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. విద్యుత్ ప్రాజెక్టులతోపాటు, రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సహకారం అందించినందుకు పి.ఎఫ్.సి. చైర్మన్ రాజీశ్ శర్మకు ముఖ్యమంత్రి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ సంక్షోభాన్ని చాలా తక్కువ సమయంలో పరిష్కరించుకుని, మిగులు విద్యుత్ రాష్ట్రం దిశగా తెలంగాణ అడుగులు వేయడానికి పి.ఎఫ్.సి. అందించిన సహకారం ఎంతో దోహదపడిందని సిఎం అన్నారు. రాజీశ్ శర్మ దంపతులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సన్మానించి, మెమెంటోలు అందించారు.

kcr cm

పి.ఎఫ్.సి.కి గౌరవం, గర్వం: రాజీశ్ శర్మ

తెలంగాణలో దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శకత్వంలో రికార్డు సమయంలో అటు పవర్ ప్లాంట్ల్, ఇటు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారని పి.ఎఫ్.సి. సిఎండి రాజీవ్ శర్మ ప్రశంసించారు. పవర్ ప్లాంట్లయినా, నీటి పారుదల ప్రాజెక్టులయినా ఇంత తొందరగా పూర్తి కావడం తానెక్కడా చూడలేదన్నారు. అనుమతులు పొందడం, నిధులను సమీకరించడం, భూ సేకరణ, ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు తదితర తతంగమంతా ఉంటుంది కాబట్టి, ఆలస్యం అవుతుందని చెప్పారు. కానీ తెలంగాణలో మాత్రం శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లు, నీటి పారుదల ప్రాజెక్టులకు తాము అందించిన ఆర్థిక సహకారం నూటికి నూరు పాళ్లు సద్వినియోగం కావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ భాగస్వామి కావడం తమకెంతో గౌరవంగా, గర్వంగా ఉందని రాజీవ్ శర్మ అన్నారు.

‘‘మూడున్నరేళ్ల కింద హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ మాకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పారు. ప్రాజెక్టు ఎలా ఉండబోతుందో స్క్రీన్‌పై చూపించారు. అది విన్న నేను ఆశ్చర్య పోయాను. ఇది సాధ్యమేనా అనుకున్నారు. కానీ నేను నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించాను. బారాజ్ లు, పంపు హౌజులను కళ్లారా చూశాను. గోదావరి నీటిని పంపింగ్ చేసే విధానం చూశాను. నిజంగా అద్భుతం. మూడున్నరేళ్ల కింద కేసీఆర్ నాకు ఏం చెప్పారో, అది కళ్లముందు కనిపించింది. ఇలాంటి ప్రాజెక్టును ఇంత త్వరగా నిర్మించడం మాటలు చెప్పినంత తేలిక కాదు. కేసీఆర్ కృషి ఫలించింది. కల నెరవేరింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి యావత్ దేశం చెప్పుకుంటున్నది. అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విజయగాథను ప్రదర్శిస్తున్నారు’’ అని రాజీవ్ శర్మ అభినందించారు.

kcr cm

జెన్ కో, ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావుకు ప్రశంసలు..

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగం సాధించిన విజయాల వెనుక జెన్ కో – ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు కృషి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్, పి.ఎఫ్.సి. సిఎండి రాజీవ్ శర్మ, సిఎస్ ఎస్.కె.జోషి ప్రశంసించారు. విద్యుత్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న ప్రభాకర్ రావు తమకు ఆదర్శమని, ఆయన నాయకత్వంలో తెలంగాణలో విద్యుత్ రంగం ఎంతో ప్రగతి సాధించిందని రాజీశ్ శర్మ కొనియాడారు. పవర్ ప్లాంట్లు శరవేగంగా నిర్మితమవుతున్నాయని, ప్లాంట్లలో పి.ఎల్.ఎఫ్. పెరిగిందని, తనపై పెట్టిన బాధ్యతలను ప్రభాకర్ రావు పూర్తిగా నెరవేర్చారని సిఎం కేసీఆర్ అన్నారు.

విద్యుత్ రంగంలో 50 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రభాకర్ రావు విద్యుత్ రంగంలో భీష్మాచార్యుడు అని సిఎస్ ఎస్.కె.జోషి అభినందించారు. విద్యుత్ రంగంపై పూర్తి అవగాహన కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో పనిచేయడం వల్లనే మంచి ఫలితాలు వచ్చాయని ప్రభాకర్ రావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. విద్యుత్ సంక్షోభ పరిష్కారం ఘనత అంతా ముఖ్యమంత్రిదే అని ఆయన అన్నారు.

- Advertisement -