మాజీ సర్పంచ్‌కు సీఎం కేసీఆర్ ఫోన్‌..!

798
cm kcr sarpanch phone
- Advertisement -

సిద్దిపేట జిల్లాలోని ఓ మాజీ సర్పంచ్‌కు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు సీఎం కేసీఆర్. స్వయంగా ఆయనకు ఫోన్ చేసి కీ బాధ్యతలు అప్పజెప్పారు. రాజధానికి కొత్త రహదారి నిర్మాణం విషయమై ములుగు మండలం క్షీరసాగర్‌ మాజీ సర్పంచ్‌ వెంకటేష్ గౌడ్‌తో ఫోన్‌లో మాట్లాడారు సీఎం.

జగదేవపూర్‌, మర్కూక్‌ మండలాల ప్రజలు హైదరాబాద్‌ త్వరగా చేరుకోడానికి రాజీవ్‌ రహదారిలో ఉన్న ఒంటిమామిడి నుంచి మర్కూక్‌ మండలం పాండురంగ ఆశ్రమం వరకు రెండు వరసల రోడ్డు నిర్మాణం చేయాలని సంకల్పించారు.

ఇందులో భాగంగా ఈ రోడ్డు నిర్మాణానికి భూమిని ఇస్తారా అనే విషయమై వెంకటేష్‌కు ఫోన్‌ చేసి ఆరా తీశారు. ఒంటిమామిడి నుంచి క్షీరసాగర్‌, కమలాబాద్‌, నర్సంపల్లి, అలియాబాద్‌, అల్లీనగర్‌ మీదుగా పాండురంగ ఆశ్రమం వరకు రహదారి నిర్మించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. రెండు వరుసల రోడ్డు నిర్మిస్తే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని, తొందరగా హైదరాబాద్‌ చేరుకోవచ్చని అన్నారు.

అంతేగాదు ఆయా గ్రామాల రైతుల భూముల విలువ కూడా పెరుగుతుందని.. భూములు ఇచ్చేలా రైతులను ఒప్పించాలని మాజీ సర్పంచికి సూచించారు. దాదాపు నాలుగు నిమిషాల పాటు మాజీ సర్పంచ్‌తో సీఎం మాట్లాడగా తాను రైతులతో మాట్లాడి విషయం చెబుతానని వెంకటేశ్ గౌడ్ బుదలిచ్చారు.

- Advertisement -