బడ్జెట్‌ రూపకల్పనలో ఆర్ధిక క్రమశిక్షణ: సీఎం కేసీఆర్

653
cm kcr
- Advertisement -

దేశ వ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో కూడా అన్ని ప్రభుత్వ శాఖలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన నుంచి మొదలుకుని నిధుల సద్వినియోగం వరకు ప్రతీ దశలోనూ పూర్తి స్థాయి క్రమశిక్షణ, ప్రణాళిక అవసరమని ముఖ్యమంత్రి చెప్పారు.

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టడానికన్నాముందే రాష్ట్ర మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులను సమావేశపరిచి, ఆర్థిక పరిస్థితిని వివరించాలని, ఆర్థిక క్రమశిక్షణ పాటించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విడమరిచి చెప్పాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వచ్చే నెలలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బడ్జెట్ పై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్. నర్సింగ్ రావు, రామకృష్ణరావు, ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

వచ్చే నెలలో నిర్వహించే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలపై చర్చ జరిగింది. వచ్చే నెలలో వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనం, మొహర్రం పండుగలున్నాయి. ఇతర సెలవులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెల 24 నుంచి దక్షిణాఫ్రికాలో జరిగే స్పీకర్లు, సెక్రటరీల సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీ పాల్గొనాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని తేదీలను ఖరారు చేయాల్సి ఉన్నందున, అసెంబ్లీ కార్యదర్శి సెప్టెంబర్ 4, 9, 14 తేదీలలో సమావేశాలు ప్రారంభించుకోవచ్చని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. పోలీసు సిబ్బంది లభ్యత, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు, సెలవులు తదితర విషయాలను పరిగణలోకి తీసుకుని ఈ మూడు తేదీల్లో ఒక తేదీని ప్రభుత్వం ఖరారు చేస్తుంది.

ఈ ఏడాది ఆరంభంలోనే ఉభయ సభలను ఉద్దేశించి, గవర్నర్ ప్రసంగం చేసినందున బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండదు. కాబట్టి రెండు రోజులు కలిసి వస్తాయి. బడ్జెట్ ప్రవేశ పెట్టడం, తదుపరి రోజు సెలవు ఇవ్వడం, తర్వాత రోజుల్లో చర్చ, తర్వాత పద్దులపై చర్చ, అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదం తదితర ప్రక్రియలుంటాయి. ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టాలనే విషయంలో త్వరలోనే నిర్ణయం జరుగుతుంది.

అసెంబ్లీని సమావేశపరచడానికి ముందే రాష్ట్ర మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విస్తృతంగా చర్చించాలని, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వాస్తవ పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించేలా ఆయా శాఖలకు సరైన మార్గదర్శకం చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

- Advertisement -