జడ్పీ చైర్​పర్సన్లకు సహాయ మంత్రి హోదా..

431
- Advertisement -

పరిపాలనలో జిల్లా పరిషత్‌ చైర్​పర్సన్లు అత్యంత కీలకం కాబోతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్‌ 32 మంది జడ్పీ చైర్​పర్సన్లకు సహాయ మంత్రి హోదా కల్పిస్తామని, విస్తృతస్థాయిలో అధికారాలిస్తామని చెప్పారు.

నెలకు లక్ష రూపాయల జీతం, కొత్త కార్లు కొనిస్తామన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సైతం ప్రభుత్వమే జీతం ఇస్తుందని, ఎవరూ ఎవరి దగ్గర చేయి చాచి డబ్బులు అడగొద్దని అన్నారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థ మొత్తం జడ్పీ చైర్​పర్సన్ల ఆధీనంలోనే పనిచేస్తుందని, మిగతా శాఖలను వారి పరిధిలోకి తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని కేసీఆర్​ తెలిపారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు అందరూ బాధ్యతగా తీసుకొని మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ విజయానికి పాటుపడాలన్నారు.రెండు రోజుల్లో కేబినెట్‌ సమావేశాన్ని నిర్వహించి మున్సిపల్‌ చట్టం ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలుపుతామని కేసీఆర్‌ తెలిపారు. జులై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని, ఆగస్టు మూడోవారంలోగా ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు.

దాదాపు గంట 15 నిమిషాల పాటు సీఎం కేసీఆర్ వివిధ అంశాలపై ప్రసంగించారు. బీజేపీ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఆ పార్టీ నాయకులకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ప్రతి విమర్శలు చేసి హీరోలను చేయొద్దని సూచించారు. 8 మంది జడ్పీటీసీలు ఉన్న బీజేపీ అధికారంలోకి వస్తామని చెబితే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు.

- Advertisement -