రైతు సంక్షేమం..పవర్ వీక్..సీఎం కేసీఆర్ ఫుల్ స్పీచ్

874
cm kcr
- Advertisement -

73వ స్వాంతత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేశారు సీఎం కేసీఆర్. అనంతరం తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సీఎం ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన త్యాగధనులకు హృదయ పూర్వక నివాళులు అర్పించారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సరైన దిశలో పెట్టేందుకు గడిచిన ఐదేళ్ళలో మనం చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి, అవుతున్నాయని చెప్పారు.

ఆర్థికాభివద్ధి

తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి గడిచిన ఐదేళ్లుగా స్థిరంగా కొనసాగుతున్నది. పటిష్టమైన క్రమశిక్షణ వల్ల అవినీతికి ఆస్కారం లేకుండా సత్వరమైన నిర్ణయాలతో ఈ లక్ష్యాన్ని మనం సాధించగలిగాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నివేదిక ప్రకారం, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 14.84 శాతం వృద్దిరేటుతో స్థూల రాష్ట్రీయ జాతీయోత్పత్తి (జి.ఎస్.డి.పి.) లో మన రాష్ట్రం ముందు వరుసలో ఉంది. ఆదాయ వృద్ధిలో స్థిరత్వం వల్ల సమకూరిన వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించడం వల్ల రాష్ట్ర సంపద ఐదేళ్లలో రెట్టింపయింది. రాష్ట్రం ఏర్పడిన నాడు తెలంగాణలో 4 లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద ఉంటే, నేడు 8.66 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవడం మన ఆర్థిక ప్రగతికి సంకేతంగా నిలుస్తుంది.

ప్రగతి ప్రస్థానం

రాష్ట్రంలో శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తున్నాయి. పేద ప్రజలను ఆదుకోవాలనే సంకల్పంతో సంక్షేమ రంగానికి పెద్దపీట వేశాం. కనీస అవసరాలకు ఇబ్బంది లేకుండా చేసుకోగలిగాం. దీర్ఘకాలికంగా తెలంగాణను వెంటాడుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలను సాధించుకోగలిగాం. ఆదర్శవంతమైన పాలనతో దేశం దృష్టిని ఆకర్షించగలిగాం. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో జరిగిన జీవన విధ్వంసం సృష్టించిన దుష్పరిణామాలను అధిగమించగలిగాం. ప్రజలు కనీస జీవన భద్రతతో జీవించే దశకు తీసుకురాగలిగాం. మన రాష్ట్రం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే దిశలో గడిచిన ఐదేళ్లలో పటిష్టమైన అడుగులు పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తున్నది. ఈ ప్రగతి ప్రస్థానాన్ని నిరంతరంగా కొనసాగిస్తామనే సంకల్పాన్ని ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంలో రాష్ట్ర ప్రజలతో పంచుకుంటున్నాను.

సుసంపన్నమైన గత చరిత్రకు, ఘనమైన వారసత్వానికి నిలయమైన మన గోల్కొండ కోట వేదికగా, స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా గతంలో మనం అనేక కార్యక్రమాలను ప్రారంభించుకుని మంచి ఫలితాలు సాధించాం. అదే స్పూర్తితో తెలంగాణ పల్లెలను, పట్టణాలను బాగు చేసుకునే ప్రణాళికను ఆవిష్కరించాలని, సుపరిపాలన దిశగా ప్రయాణం ప్రారంభించాలని ప్రభుత్వం తలపెట్టింది.

పరిపాలనలో సంస్కరణలు

సుపరిపాలన కోసం, అవినీతిని అంతమొందించడం కోసం, జాఢ్యాలను, జాప్యాలను తుదముట్టించడం కోసం, గ్రామాలను, పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం చట్టపరమైన సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయడం కోసం ప్రభుత్వం కొత్త పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేసింది. గతంలో పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను ఇప్పుడు 33 జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్నాం. 43 రెవెన్యూ డివిజన్లను 69 కి పెంచుకున్నాం. 459 మండలాలను 584 మండలాలుగా చేసుకున్నాం. గతంలో 68 మున్సిపాలిటీలుంటే, నేడు తెలంగాణలో 142 మున్సిపాలిటీలున్నాయి. కొత్తగా 7 మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసుకుని, మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్యను 13 కు పెంచుకున్నాం. గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలు, మారుమూల పల్లెలను ప్రభుత్వం ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చింది. గతంలో 8,690 గ్రామ పంచాయతీలుంటే, వాటి సంఖ్యను 12,751 కు పెంచాం. ఇటీవలే కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఇవాళ మొదటి సారిగా గ్రామ పంచాయతీలుగా మారిన తమ పల్లెలు, తండాలు, గూడాల్లో సగర్వంగా జాతీయ పతాకాన్ని ఎగురేసుకుంటున్న దృశ్యం ఆవిష్కృతమైంది.

కొత్త జోనల్ వ్యవస్థ

ఉద్యోగావకాశాలు స్థానికులకే ఎక్కువ దక్కాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. లోకల్ క్యాడర్ ఉద్యోగాలు 95 శాతం స్థానికులకే దక్కేలా ప్రభుత్వం చట్టం చేసి, కేంద్ర ప్రభుత్వం ఆమోదాన్ని కూడా పొందింది. ఇప్పుడు కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి.

కొత్త చట్టాలు

పరిపాలనా సంస్కరణలతోనే ప్రజలకు మెరుగైన పాలన అందించడం సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. అవినీతికి ఆస్కారం లేని సుపరిపాలన అందించడానికి ప్రస్తుతమున్న చట్టాలు సరిపోవు. పాత చట్టాలను సమూలంగా మార్చాల్సిన అవసరం వచ్చింది. అందుకే ప్రభుత్వం నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని, నూతన పురపాలక చట్టాన్ని తీసుకొచ్చింది. నూతన రెవెన్యూ చట్టం కూడా రూపుదిద్దుకుంటున్నది.

ఈ మూడు కొత్త చట్టాల వెలుగులో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా పరిశుభ్రమైన, పచ్చదనం వెల్లివిరిసే గ్రామాలు, మున్సిపాలిటీలను తయారు చేసుకోగలమనే దృఢమైన విశ్వాసం నాకున్నది. ప్రజలకు, రైతులకు ఎలాంటి యాతన లేకుండా సేవలందించడమే లక్ష్యంగా, కొత్త రెవెన్యూ చట్టం రూపుదిద్దుకుంటున్నది.

60 రోజుల ప్రత్యేక కార్యాచరణ

ఈ చట్టాల అమలుకు శ్రీకారం చుడుతూ నూతన ఒరవడిని ప్రవేశ పెట్టడం కోసం గ్రామాలలో, పట్టణాలలో 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తున్నది. ఫైనాన్స్ కమిషన్ల గ్రాంటు నిధులను ఈ 60 రోజుల ప్రణాళిక అమలుకు ముందే స్థానిక సంస్థలకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గ్రామాల్లో అయినా, పట్టణాల్లో అయినా అపరిశుభ్రతే అనారోగ్యానికి కారణం. అనాగరిక వ్యవస్థకు సంకేతం. ఈ చెడ్డ పేరును మనం తొలగించుకోవాలి. 60 రోజుల ప్రణాళికలో ప్రజా ప్రతినిధులు, అధికారులు విశేషమైన ప్రజా భాగస్వామ్యం సాధించి గ్రామాలు, పట్టణాల రూపురేఖల్ని మార్చాలి.

60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మొదటి దశలో గ్రామాలలో, పట్టణాలలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలి. క్లీన్లీ నెస్ ఈజ్ గాడ్లీ నెస్ అని, పరిశుభ్రమైన పరిసరాల్లోనే పరమాత్ముడు కొలువై ఉంటాడని మనందరికీ తెలిసిన విషయమే. అపరిశుభ్రతే అనారోగ్యానికి, అనాగరికతకు సంకేతం.

ఈ 60 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ప్రజా సంఘాలు, ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర చెత్త నిర్మూలనకు నడుం కట్టాలి. ఈ 60 రోజుల తర్వాత గ్రామాల రూపురేఖలు, పట్టణాల రూపురేఖలు ఖచ్చితంగా మారాలి. అపరిశుభ్రత వల్ల ఆపదపాలయ్యేది పేద ప్రజలే. గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలు ప్రజల భాగస్వామ్యంతో చెత్త నిర్మూలనకు నడుం కట్టాలి.

పరిశుభ్రత పెంచే కార్యక్రమం

ఈ రోజు మన గ్రామాలు, పట్టణాల పరిస్థితి ఎట్లున్నదో మనందరికీ తెలుసు. అది అనునిత్యం మన కళ్ల ముందే కదులుతున్న దృశ్యం. ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోయిన పిచ్చిమొక్కలు. కూలిపోయిన ఇండ్ల శిథిలాలు. పాడు పడిన పశువుల కొట్టాలు. మురుగునీటి నిల్వతో దోమలను సృష్టిస్తున్న గుంతలు. పాడుపడిన బావులు… ఇవీ రాష్ట్ర వ్యాప్తంగా కనినిపిస్తున్న దృశ్యాలు. వీటన్నింటినీ ఈ 60 రోజుల్లో తొలగించుకోవాలి. నిరుపయోగంగా ఉన్న బోరు బావులను వెంటనే పూడ్చివేయాలి.

పవర్ వీక్

గ్రామాలు, పట్టణాల పరిసరాల్లోనూ, గ్రామాలు, పట్టణాల లోపల ఉన్న కొన్ని వంగిపోయిన కరెంటు పోళ్లు, తుప్పు పట్టిన పాత స్తంభాలు, వేలాడుతున్న కరెంటు వైర్లు దర్శనమిస్తున్నాయి. మూడో వైరు (థర్డ్ వైరు) లేకపోవడం వల్ల కొన్ని చోట్ల వీధి దీపాల నిర్వహణ ఇబ్బందిగా మారింది. ఈ దుస్థితిని నివారించడానికి 60 రోజుల ప్రణాళికలో భాగంగా వారం రోజుల పాటు విద్యుత్ శాఖ, ప్రజల భాగస్వామ్యంతో పవర్ వీక్ నిర్వహించుకోవాలి. వంగిన పోళ్లను సరిచేయాలి. తుప్పు పట్టిన పాత స్తంభాల స్థానంలో కొత్త పోళ్లు వేయాలి. వేలాడే వైర్లను సరిచేయాలి. అన్ని గ్రామాలకు, పట్టణాలకు అవసరమైన స్తంభాలు, వైర్లను ప్రభుత్వమే సమకూరుస్తుంది. విద్యుత్ శాఖ సిబ్బంది వారం రోజుల పాటు గ్రామాల్లో, డివిజన్లలోనే అందుబాటులో ఉంటారు. విద్యుత్ కు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరించుకుని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.

పచ్చదనం పెంచే కార్యక్రమం

60 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ పట్టణం, ప్రతీ గ్రామం తమకు అవసరమైన నర్సరీలను స్థానిక సంస్థల ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేసుకోవాలి. మొక్కల సంఖ్యను, మొక్కల రకాలను, ఇతర విషయాలలో జిల్లా గ్రీన్ కమిటీ (హరిత కమిటీ) అందించే సూచనలను ఖచ్చితంగా పాటించాలి. పట్టణ, గ్రామ బడ్జెట్ లో 10 శాతం నిధులను పచ్చదనం పెంచే పనుల కోసం కేటాయించాలి. నిర్దిష్టమైన విధానంలో గ్రీన్ కమిటీ సూచనల మేరకు మొక్కలు నాటాలి. ప్రజల చేత నాటించాలి. పట్టణాల్లో, గ్రామాల్లో ప్రతీ ఇంటికీ ప్రజలు కోరుకునే ఆరు మొక్కలను సరఫరా చేయాలి. ప్రజలంతా ఆ మొక్కలను చక్కగా కాపాడి పెంచి, పెద్ద చేసే ప్రేరణ కలిగించాలి. మొక్కలను నాటే విషయంలో, కాపాడే విషయంలో ఎలాంటి అజాగ్రత్త, అలసత్వానికి తావివ్వొద్దు.

డబ్బు పెట్టి ఎన్ని సుఖాలైనా కొనుక్కోవచ్చు. పర్యావరణ సమతౌల్యం లేనప్పుడు కృత్రిమ సుఖాలెన్నున్నా బ్రతుకు నరకప్రాయమవుతుంది. డబ్బు పెట్టి వానలు కొనలేం, గాలిని కొనలేం, ప్రశాంతతను కొనలేం. పచ్చని చెట్లు, పరిశుభ్ర వాతావరణం మాత్రమే జీవితాన్ని సుఖ ప్రదం చేస్తాయి. వత్తిడిని తగ్గిస్తాయి. ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుతాయి. రాబోయే తరానికి ఆస్తుపాస్తులిస్తే సరిపోదు. ఆకుపచ్చని పర్యావరణాన్ని వారసత్వంగా అందించడమే మన నిజమైన కర్తవ్యం కావాలి. 60 రోజుల ప్రత్యేక కార్యాచరణలో ఒక ఆదర్శవంతమైన విధానాన్ని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. ఈ విధానాన్ని అనుసరించి గ్రామాల, పట్టణాల అభివృద్ధి కోసం వార్షిక, పంచవర్ష ప్రణాళికలను ఆయా పాలక మండళ్లు రూపొందించాలి. ఈ ప్రణాళికలు ఖచ్చితంగా గ్రామసభల ఆమోదం పొందాలి. దానికి అనుగుణంగానే స్థానిక సంస్థలు నిధులు ఖర్చు చేయాలి. తద్వారా పల్లెలు, పట్టణాలు ఓ పద్ధతి ప్రకారం ప్రగతి సాధించడానికి సరైన దారి ఏర్పడుతుంది.

పల్లెలను ప్రగతి కేంద్రాలుగా, ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం పంచాయతీ రాజ్ విభాగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయించింది. పంచాయతీ రాజ్ శాఖలోని అన్ని విభాగాల్లో అన్ని ఖాళీలను వేగవంతంగా భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నూతన చట్టాలు నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చడం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు మరింత నిబద్ధతతో, కార్యదీక్షతో పనిచేయాలనీ, ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం పొందేలాగా సేవలనందించాలని నేటి స్వాతంత్ర దినోత్సవ వేదిక నుంచి పిలుపునిస్తున్నాను.

ప్రగతికి ప్రధాన అవరోధంగా ఉన్న విద్యుత్ సమస్యను మనం చాలా తక్కువ సమయంలోనే సమర్థవంతంగా పరిష్కరించుకోగలిగాం. దేశమే అబ్బురపడి మన నుంచి నేర్చుకునే విధంగా రూపుదిద్దుకున్న మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలో మంచినీటి ఎద్దడిని నివారించుకోగలిగాం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పెన్షన్లను రెట్టింపు చేసుకున్నాం. దివ్యాంగులకు 3016 రూపాయలు, ఇతరులకు 2016 రూపాయల పెన్షన్ అందించుకుంటున్నాం. వృద్దాప్య పెన్షన్ వయో పరిమితిని 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి, పెంచిన పెన్షన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అర్హుల జాబితా రూపొందించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.

వ్యవసాయం – రైతు సంక్షేమం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతాంగ విధానం యావత్ దేశానికి ఆదర్శం అయింది. వ్యవసాయాభివృద్ధి కోసం ప్రపంచ వ్యాప్తంగా అమలయ్యే గొప్ప కార్యక్రమాల జాబితాలో మన రైతుబంధు, రైతు బీమా పథకాలను పేర్కొనడం ద్వారా ఐక్యరాజ్యసమితి మన రాష్ట్ర కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో పెంచింది. మన రాష్ట్రానికి ప్రశంసలు అందించింది. ఇది మన రాష్ట్ర రైతు లోకానికి, మనందరికీ గర్వకారణం.

ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు రైతుబంధు పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ఎకరానికి ఏడాదికి 8 వేల నుంచి 10 వేల రూపాయలకు పెంచి, అందిస్తున్నాం. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుబీమా పథకాన్ని కొనసాగిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల వరకున్న పంట రుణాలను మాఫీ చేయడం కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించుకున్నాం.

కాళేశ్వరం ప్రాజెక్టు

వడివడిగా రూపుదిద్దుకుంటున్న కృష్ణ, గోదావరి ప్రాజెక్టులు మన కళ్లముందే కనిపిస్తున్నాయి. ప్రపంచమే అబ్బురపడే కాళేశ్వరం ప్రాజెక్టును ఈ మధ్యనే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమక్షంలో మనం సగర్వంగా ప్రారంభించుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం యొక్క పరిపాలనా పరిణతికి, దౌత్యనీతికి, స్నేహ సంస్కారానికి ప్రతిబింబంలా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికి గొప్ప సందేశం ఇచ్చిందని యావత్ దేశం కొనియాడుతున్నది. తెలంగాణ రాష్ట్రం అవలంభిస్తున్న లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ అన్ని రాష్ట్రాలకు అనుసరణీయమైన విధానమనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

ఇంతటి భారీ ప్రాజెక్టు నిర్మాణం కావాలంటే కనీసం 15-20 ఏళ్లు పడుతుంది. కానీ ఎండనూ, వాననూ, చలినీ లెక్క చేయకుండా రాత్రనకా పగలనకా మూడు షిఫ్టులు శ్రమించి, మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసిన ఇంజనీర్లు, అధికారులు, కార్మికులు, ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. కార్యసాధకులందరికీ వినమ్రంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.

అదనంగా 575 టిఎంసిలు

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతీ ఏటా 400 టిఎంసిల నీటిని నికరంగా ఉపయోగించుకునే అవకాశం మన రాష్ట్రానికి ఏర్పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీరివ్వడానికి సీతారామ ప్రాజెక్టు ద్వారా 100 టిఎంసిలు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు నీరివ్వడానికి దేవాదుల ద్వారా 75 టిఎంసిల నీటిని నికరంగా వాడుకోవడానికి వీలు కలుగుతుంది. శరవేగంగా నిర్మాణమవుతున్న ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఏడాది నుంచే సాగునీరు అందించడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల వచ్చే జూన్ నుంచి తెలంగాణ రైతాంగం ఇప్పుడున్న గోదావరి ప్రాజెక్టులకు అదనంగా 575 టిఎంసిల నీటిని నికరంగా ఉపయోగించుకునే అవకాశం కలుగుతున్నదనే సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను.

పాలమూరు ప్రాజెక్టులు

పాలమూరు జిల్లాలో ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం చాలా వేగంగా పూర్తి చేసింది. జూరాలతో కలిపి పాలమూరు జిల్లాలో నేడు 11 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు అందించుకోగలుగుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చాలా వేగంగా నిర్మించి ఉమ్మడి మహబూబ్ నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లా రైతులకు సాగునీరు అందిస్తామని తెలియచేస్తున్నాను.

కుల వృత్తులు

గ్రామీణ పరిశ్రమలకు, చేతివృత్తులకు ప్రభుత్వ విశేషమైన ప్రోత్సాహం ఇస్తున్న విషయం ప్రజల అనుభవంలోనే ఉన్నది. నేత, గీత తదితర వృత్తిదారుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రజల కళ్ల ముందున్నాయి. అన్ని వర్గాల ప్రజల పండుగలకు ప్రభుత్వం సమాన హోదా కల్పించింది. అందరి మనోభావాలను గౌరవిస్తూ, గంగా జమునా తహజీబ్ ను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిరక్షిస్తున్నది.

దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు చెందిన పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన కార్పొరేట్ స్థాయి విద్య అందించడానికి 906 గురుకుల పాఠశాలలు నిర్వహిస్తూ, మనం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాం. న్యాయవాదులు, జర్నలిస్టుల సంక్షేమం కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేసుకుంటున్నాం.

ప్రజావైద్యం

ప్రభుత్వం అనుసరిస్తున్న వైద్య విధానం పేదల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతున్నది. కేసీఆర్ కిట్స్ తో పాటు అందిస్తున్న నగదు ప్రోత్సాహం అద్భుతమైన ఫలితం సాధించింది. రాష్ట్రంలో మాతా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. కంటి వెలుగు కార్యక్రమం దృష్టిలోపాలు సరిచేసుకునేందుకు ప్రజలకు గొప్ప అవకాశం కల్పించింది. ప్రజలందరికీ సంపూర్ణంగా ఆరోగ్య పరీక్షలు జరిపి, ఆ ఫలితాల ఆధారంగా తెలంగాణ ఆరోగ్య సూచిక ‘హెల్త్ ప్రొఫైల్’ తయారు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నది.

పరిశ్రమలు – ఐటి

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా పరుగులు పెడుతున్నది. ఐటి అభివృద్ధి స్థిరంగా కొనసాగుతున్నది. గడిచిన ఐదేళ్ళలో ఐటి ఎగుమతులు 52వేల కోట్ల నుంచి లక్షా 10వేల కోట్ల రూపాయలకు చేరుకోవడం ఐటి రంగంలో మనం సాధించిన ప్రగతికి అద్దం పడుతున్నది.

హైదరాబాద్ అభివృద్ధి

జంట నగరాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక వ్యూహం అవలంభిస్తున్నది. పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు నిర్వహిస్తున్న బస్తీ దవాఖానాల సంఖ్యను మరింత పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. మెట్రోరైలు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తున్నది.

కొత్త రెవెన్యూ చట్టం

బూజు పట్టిన పాత రెవెన్యూ చట్టాలు రైతులకు, ప్రజలకు అపారనష్టం కలిగించాయి. ఈ నష్టాన్ని నివారించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో ప్రభుత్వం నిమగ్నమైంది. అవినీతికి ఆస్కారం లేని, అలసత్వానికి అవకాశం లేని నూతన రెవెన్యూ చట్టాన్ని త్వరలోనే జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశ పెడతామనే సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను.

శాంతి భద్రతలు

శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ వరుసలో ఉన్న రాష్ట్రాల సరసన చేరింది. శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు ప్రకృతి వైపరీత్యాలు, జాతరలు, ఉత్సవాలు తదితర భారీ కార్యక్రమాలను నిశితంగా గమనించేందుకు హైదరాబాద్ లో నిర్మిస్తున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. నేరాల అదుపులో అద్భుత పనితీరు కనబరుస్తున్న యావత్ పోలీసు యంత్రాంగాన్ని ఈ సందర్భంగా మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. తెలంగాణలో సామరస్య వాతావరణాన్ని కొనసాగించే విషయంలో ప్రజల సహకారం కూడా కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.

పోరాడి సాధించుకున్న తెలంగాణలో గత ఐదేళ్ళలో పునర్నిర్మాణ ప్రణాళికను ఒక యజ్ఞంలా నిర్వహించాం. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడం కోసం పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలుచేసాం. విద్యుత్తూ, తాగునీరు, రహదారుల నిర్మాణం తదితర మౌలిక సదుపాయాల కల్పన చేసుకున్నాం. తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రం గా దేశం ముందు గర్వంగా నిలబడ్డది. బంగారు తెలంగాణా అనే సౌధం నిర్మించడానికి కావాల్సిన పునాదులు పడ్డాయి. నీతిమంతమైన, నిబద్ధత తో కూడిన పారదర్శక పరిపాలన ద్వారా మన స్వప్నం మరింత తొందరగా సాకారం అవుతుంది. అందుకే పాత చట్టాల బూజును తొలగించి వర్తమాన సామాజిక స్థితిగతులకు సరిపోయే నూతన చట్టాలను ప్రభుత్వం అమలు లోకి తెస్తున్నది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నది. స్వరాష్ట్రం లో సుపరిపాలన అనే నినాదంతో ముందుకు సాగుదాం. సమున్నత లక్ష్య సాధన కోసం సాగుతున్న ఈ ప్రగతి ప్రస్థానంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. భవిష్యత్తును సుందరంగా నిర్మించుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధం కావాలని కోరుకుంటూ, మరోసారి రాష్ట్ర ప్రజానీకానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -