పౌరసరఫరాల శాఖ..వార్షిక నివేదిక

279
niranjanreddy
- Advertisement -

ధాన్య సేకరణ, ప్రజాపంపిణీ విధానంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పౌరసరఫరాల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు సాంకేతిక పరిజ్ఞానంతో పౌరసరఫరాల శాఖ చేపట్టిన సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు.

పౌరసరఫరాల శాఖ చేపట్టిన సంస్కరణలు, విధానాలను పరిశీలించి, అధ్యయనం చేయడానికి గడిచిన ఏడాది కాలంలో కేంద్ర పౌరసరఫరాల శాఖ అధికారులతో పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల పౌరసరఫరాల అధికారులు, ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజర్‌లతో పాటు లిబియా, తజకిస్తాన్‌, కెన్యా, టాన్జానియా తదితర 33 దేశాలకు చెందిన ప్రతినిధులు, అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఈస్ట్‌ ఏషియన్‌ నేషన్స్‌ (ఆసియాన్‌) దేశాల నుంచి గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక సంక్షేమాభివృద్ధి తదితర విభాగాలకు చెందిన ప్రతినిధులు వచ్చారని అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖ ఇటు రైతాంగానికి, అటు పేద ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తూ మంచి ఫలితాలను సాధిస్తోందని అన్నారు. ఈ-పాస్‌, ఐరిస్‌, టీ-రేషన్‌ యాప్‌, రేషన్‌ పోర్టబిలిటీ, బియ్యం రవాణా వాహనాలకు జీపీఎస్‌, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వంటి చర్యల ద్వారా ప్రజా పంపిణీ విధానంలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నామన్నారు.

పౌరసరఫరాల శాఖ ప్రతి నెల 2.83 కోట్ల మంది రేషన్‌ లబ్ధిదారులకు కిలో రూపాయి చొప్పున నెలకు 6 కిలోల బియ్యాన్ని అందిస్తోందని, ఇవి పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు చేపట్టిందని అన్నారు.

అర్హులైన పేదలకే బియ్యం అందేలా రేషన్‌ షాపుల్లో ఈపాస్‌ విధానాన్ని అమలు చేశామని, దీంతో పాటు లబ్ధిదారులకు మరింత సులువుగా, మరింత ప్రయోజనం కలిగించేలా వేలిముద్రలతో పాటు కనుపాపల (ఐరిస్‌) ఆధారంగా సరుకుల పంపిణీని సైతం ప్రారంభించామన్నారు. ఈపాస్‌తో పాటు ఐరిస్‌ విధానాన్ని అమలు చేస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని అన్నారు.రేషన్‌ డీలర్లకు ఖచ్చితమైన తూకంతో నిత్యావసర సరుకులు అందించడానికి గోదాముల్లో ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాలను (ఈవేయింగ్‌ మెషీన్‌) తీసుకు రావడం జరిగిందని తెలిపారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం పంపిణీలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం కోసం వేలిముద్రల ఆధారంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ-పాస్‌ యంత్రాల ద్వారా బియ్యాన్ని పంపిణీ ప్రక్రియను ప్రారంభించామని, ఇది విజయవంతం కావడంతో ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లకు కూడా ఈ-పాస్‌ ద్వారా సన్నబియ్యం సరఫరా చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు… 24 గంటలు ఉచిత కరెంట్‌, నూతన సాగునీటి ప్రాజెక్టులు, రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలతో ఏటేటా ధాన్యం దిగుబడి గణనీయంగా పెరుగుతోందని, ఇందుకు అనుగుణంగా ధాన్య సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, కచ్చితంగా కనీస మద్దతు ధరకు లభించేలా పౌరసరఫరాల శాఖ అన్ని చర్యలు చేపడుతోందన్నారు.ఈ ఏడాది 14,62,382 మంది రైతుల నుండి 77.07 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, ఇందుకు సంబంధించి రూ. 13,622 కోట్లను రైతులకు చెల్లించిందని తెలిపారు.

కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు, చెల్లింపులు, కొనుగోలు కేంద్రాల సమాచారాన్ని రైతులకు సెల్‌ఫోన్‌ ద్వారా అందించడం, మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు, కనీస మద్దతు ధర చెల్లింపులకు వంటి అంశాల్లో రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఓపీఎంఎస్‌)ను పౌరసరఫరాల శాఖ మరింత అభివృద్ధి చేసిందని అన్నారు.ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ పాల్గొన్నారు.

- Advertisement -