జూలై 15న మిషన్‌ చంద్రయాన్-2..ఫోటోలు రిలీజ్

135
chandrayan2

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీర్తికీరిటంలో మరో మైలురాయి చేరనుంది. చంద్రగ్రహంపైకి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -2ను జూలై 15న నింగిలోకి ప్రయోగించనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగానికి సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది ఇస్రో.

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్‌ఎల్‌వీ ఎంకే-III వాహకనౌక ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని ద్వారా చంద్రగ్రహంపైకి ఆర్బిటార్‌, ల్యాండ‌ర్‌, రోవర్‌‌ను ప్రవేశ పెట్టనున్నారు. ల్యాండర్‌కు ‘విక్రమ్’ అని, రోవర్‌కు ‘ప్రగ్యాన్’ అని నామకరణం చేశారు. ఆర్బిటార్ ప్రొప‌ల్షన్ మాడ్యూల్ ద్వారా చంద్రయాన్-2 శాటిలైట్‌ను చంద్రుడి ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. ఆ త‌ర్వాత ఆర్బిటార్ నుంచి ల్యాండ‌ర్ వేరుప‌డుతుంది. చంద్రుడిపై ఉన్న ద‌క్షిణ ధ్రువంలో ల్యాండర్ దిగుతుంది. అనంతరం శాస్త్రీయ ప‌రీక్షల నిమిత్తం చంద్రగ్రహంపై రోవ‌ర్ సంచ‌రిస్తుంది.

2019 సెప్టెంబ‌ర్ 6న అది చంద్రుడిపై దిగే అవ‌కాశాలు ఉన్నాయి. చంద్రయాన్-2 ప్రయోగం ద్వారా 11 పేలోడ్స్‌ను కూడా కక్ష్యలోకి తీసుకువెళ్లనున్నారు. ఇందులో భారత్‌కు చెందిన‌ 6, యూరోప్‌కు చెందిన 3, అమెరికాకు చెందిన 2 పేలోడ్స్ ఉంటాయి. ఇస్రో 2009లో చంద్రయాన్-1ను విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే.