జూలైలో ఐపీఎల్..?

421
ipl
- Advertisement -

కరోనా వైరస్‌ వ్యాపి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పలు క్రీడలు వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే ఐపీఎల్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 15 తరువాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ తెలిపింది. కానీ ఈసారి సమ్మర్‌లో ఐపీఎల్ జరిగే అవకాశాలు దాదాపుగా లేవని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఐపీఎల్‌ను ఓ సీజన్ మొత్తం నిర్వహించకుండా ఉంటే పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని భావించిన బీసీసీఐ… సమ్మర్‌లో కాకుండా ఈ మెగా టోర్నీని జూలై- సెప్టెంబర్ మధ్య నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే ఐసీసీ టోర్నీలతోపాటు వివిధ దేశాల మధ్య ఎక్కువ పోటీలు లేకపోవడంతో ఈ సమయమే లీగ్ నిర్వహణకు అనువుగా ఉందని భావిస్తోంది. ఐసీసీ ఫ్యూచర్‌‌ టూర్స్‌ ప్రోగ్రామ్‌ (ఎఫ్‌టీపీ) ప్రకారం సెప్టెంబర్‌‌ నెలలో ఆసియా కప్‌ జరగాల్సి ఉంది. అలాగే ఇంగ్లండ్ తమ స్వదేశంలో పాకిస్థాన్‌తో సిరీస్‌ ఆడుతుంది. అనంతరం ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది. దాంతో పాటు జూన్, జులై మధ్య ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ‘ది హండ్రెడ్‌’(వంద బంతుల మ్యాచ్‌) లీగ్‌ కోసం ప్రణాళికలు రచిస్తోంది.

ఈ లెక్కన ఇంగ్లండ్, పాకిస్థాన్ లకు తప్ప మిగతా ప్రధాన దేశాలకు జులై–సెప్టెంబర్‌ పెద్దగా సిరీస్‌లు లేవు. ఆసియా కప్‌ మినహాయిస్తే టీ20 వరల్డ్‌ కప్‌కు ముందు భారత్‌.. జూన్‌, జులైలో ఆస్ట్రేలియా, శ్రీలంకతో మూడేసి వన్డేల సిరీస్‌లను ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌ల్లో మార్పులు చేసి ఐపీఎల్‌ నిర్వహణకు మార్గం సుగమం చేయాలని బోర్డు పెద్దలు ఆలోచిస్తున్నారు.

- Advertisement -