గ్రేటర్‌లో యుద్ద ప్రాతిపదికన రోడ్ల మరమ్మత్తు..

624
bonthu rammohan
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ లో గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులను యుద్ద ప్రాతిపదికపై పూర్తి చేయాలని జీహెచ్ఎంసి, హైదరాబాద్ మెట్రో రైలు, హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేసన్ అధికారులను నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశించారు.

ఇవాళ సికింద్రాబాద్ జోన్ పరిధిలోని కవాడిగూడ గాంధీ ఆసుపత్రి నుండి ఆర్టిసీ క్రాస్ రోడ్స్ వరకు దెబ్బతిన్న రోడ్లను కమిషనర్ ఎం.దానకిషోర్, హైదరాబాద్ మెట్రో రైలు ఎం.డి ఎన్.వి.ఎస్ రెడ్డిలతో కలిసి మేయర్ రామ్మోహన్ కాలినడకన వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ నగరంలో రోడ్లపై ఏర్పడ్డ 4వేలకు పైగా గుంతలను జీహెచ్ఎంసీకి చెందిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ లు పూడ్చివేస్తున్నాయని, వర్షం ఆగిపోతే ఈ రోడ్ల గుంతల పూడ్చివేత కార్యక్రమం మంగళవారం పూర్తి అవుతుందని స్పష్టం చేశారు.

దెబ్బతిన్న రోడ్డు మార్గాల పునరుద్దరణకు సంబంధించి రెండు రోజుల్లోగా స్వల్పకాలిక టెండర్లను పూర్తిచేసి పనులను బుధవారం నుండి ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు. మెట్రో రైలు కారిడార్ మార్గంలో రహదారుల పునరుద్దరణకు రూ. 5కోట్లతో హైదరాబాద్ మెట్రో రైలు చేపడుతోందని వెల్లడించారు. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ మెట్రో రైలు, హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అధికారులు కూడా తమ పరిధిలోని రోడ్లకు యుద్ద ప్రాతిపదికపై మరమ్మతులను చేపట్టాలని ఆదేశించామని, దీనిలో భాగంగా చీఫ్ ఇంజనీర్ల బ్రుందం నగరంలోని ఇతర ప్రాంతాల్లో నేడు విస్త్రుతంగా పర్యటించిందని పేర్కొన్నారు.

జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ మాట్లాడుతూ నగరంలో రోడ్ల మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ సీనియర్ అధికారులను ప్రతి జోన్ లు, సర్కిళ్లకు ప్రత్యేక అధికారులుగా నియమించామని తెలిపారు. షల్మాక్ మిశ్రమంతో పాటు జెట్ ప్యాక్ యంత్రాలతో రోడ్లపై గుంతల పూడ్చివేత కార్యక్రమం జరుగుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండి ఎన్.వి.ఎస్ రెడ్డి మాట్లాడుతూ సికింద్రాబాద్ స్టేషన్ నుండి మహాత్మగాంధీ బస్ స్టేషన్ వరకు మెట్రో రైలు మార్గంతో పాటు ఇతర మెట్రో రైలు మార్గాల్లో రోడ్ల పునరుద్దరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందుకుగాను రూ. 5కోట్లను వెంటనే కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు.

కాగా గాంధీ ఆసుపత్రి నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు కాలి నడకన పర్యటించిన రోడ్ల మరమ్మతులు, ఆక్రమణల తొలగింపుపై పలు సూచనలను అధికారులకు చేశారు. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రి ఎదురుగా ప్రధాన రహదారిపై ఉన్న ప్రైవేట్ వాహనాలు, జె.సి.బిలను వెంటనే తొలగించాలని సూచించారు. ముషిరాబాద్ చౌరస్తా నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు నీటి నిల్వ ప్రాంతాలను పరిశీలించి తగు సూచనలను చేశారు. రహదారుల వెంట ఉన్న నిర్మాణ వ్యర్థాలను తొలగించడంతో పాటు స్టార్మ్ వాటర్ డ్రెయిన్లలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించామని సూచించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ జె.శంకరయ్య, ఎస్.ఇ అనిల్ రాజ్, డిప్యూటి కమిషనర్ ఉమాప్రకాష్, నలిని పద్మావతి తదితరులు హాజరయ్యారు.

- Advertisement -