కోమటిరెడ్డికి షాకివ్వనున్న బీజేపీ..!

285
komatireddy rajagopal

ఆపరేషన్ సౌత్‌లో భాగంగా తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారించింది బీజేపీ. ఇప్పటికే ఏపీ,తెలంగాణలో పలువురిని పార్టీలో చేరుకున్న కమలం నేతలు రానున్న రోజుల్లో మరికొంతమంది నేతలను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీ నేత మురళిధర్‌ రావు సమక్షంలో బీజేపీలో చేరారు. త్వరలో టీడీపీ ఎమ్మెల్యేలను కూడా పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు కాషాయ నేతలు.

ఇక తెలంగాణలో సైతం టీడీపీకి చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి, చాడ సురేష్ రెడ్డి,బోడ జనార్థన్‌ సహా పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకోనుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఇప్పటికే బీజేపీలో చేరుతానని ప్రకటించారు. కార్యకర్తలు కొంతమంది వ్యతిరేకించినా కోమటిరెడ్డి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తేలేదని,రాహుల్‌పై సైతం విమర్శలు చేశారు.

అంతేగాదు ఓ అభిమానితో మాట్లాడుతూ బీజేపీలో చేరితే తాను సీఎం కావడం ఖాయమని చెప్పిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు స్పందించారు. పదవులు ఆశించి పార్టీలోకి వస్తే వారికి భంగపాటు తప్పదని పరోక్షంగా కోమటిరెడ్డికి సూచిస్తున్నారు. అంతేగాదు తమ కట్టుబాట్లకు అంగీకరిస్తేనే బీజేపీలో చేర్చుకుంటామని చెబుతున్నారు. మరో అడుగు ముందుకేసి అసలు కోమటిరెడ్డిని బీజేపీలో చేర్చుకోవాలా వద్దా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆ పార్టీ నేతలు చెబుతుండటం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన కోమటిరెడ్డి బీజేపీలో చేరకముందే నోటికి పనిచెప్పి ఆ పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొవడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.