పసుపు బోర్డుపై మాటమార్చిన బీజేపీ…!

626
nizamabad mp
- Advertisement -

బీజేపీని గెలిపిస్తే వారం రోజుల్లో నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు కాషాయం నేతలు. బీజేపీ జాతీయ నేత రాంమాధవ్‌, నాటి ఎంపీ అభ్యర్ధి, ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ క్షేత్రస్ధాయిలో బల్ల గుద్ది మరి చెప్పారు. అంతేగాదు అరవింద్ ఐతే ఒకడుగు ముందుకేసి వారంరోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే రాజీనామా చేసి రైతులతో కలిసి ఆందోళన బాటపడతానని బాండ్ కూడా రాసిచ్చారు. దీంతో బీజేపీ నేతల మాటలను నమ్మిన పసుపు రైతులు ఆ పార్టీని గెలిపించారు.

ఇప్పటివరకు బాగానే ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తోంది కానీ పసుపు బోర్డు ఉసే లేదు. పైగా కొత్త పల్లవి అందుకున్నారు కాషాయ నేతలు. పసుపుబోర్డుపై అభిప్రాయ సేకరణ పేరుతో రైతులే పసుపుబోర్డు వద్దన్నారంటూ కొత్త వాదన తెరమీదకు తెచ్చారు. కేవలం మద్దతు ధర ఇస్తే చాలని రైతులు చెబుతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు.

నాడు పసుపు బోర్డు అంశాన్ని హైలైట్ చేస్తూ గెలుపుబాట పట్టిన బీజేపీ నేతలు ఇప్పడు మాటమార్చడంపై రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. వాస్తవానికి ప్రపంచంలో పండే పసుపులో 80 శాతం భారతదేశం నుంచి ఉత్పత్తి అవుతోంది. ఇందులో అత్యధిక భాగం నిజామాబాద్,ఆర్మూర్ నుంచే వస్తోంది. అందుకే నిజామాబాద్‌లో పసుపు బోర్డు అంశం కీలక ఇష్యూగా మారింది.

ఎందుకంటే నిజామాబాద్‌లో పసుసు బోర్డు ఏర్పాటైతే పరిశోధనలు జరిగే అవకాశం ఉంది. పసుపును ఎగుమతి చేయాలన్నా,స్థిరమైన ధరలు,గిట్టుబాటు ధర రైతులకు దక్కాలంటే పసుపుబోర్డు తప్పని సరి…అందుకే దశాబ్దాలుగా పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

వాస్తవానికి 2014లో నిజామాబాద్‌ ఎంపీగా గెలిచిన కవిత పసుపుబోర్డు అంశంపై రాజీలేని పోరాటం చేశారు. పార్లమెంట్‌లో పసుపు బోర్డు అవశ్యకతను వివరించడమే కాదు పలువురు కేంద్రమంత్రులకు మెమోరాండం కూడా ఇచ్చారు.కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదు.

ఇక ప్రస్తుతం పసుపు బోర్డు అంశాన్ని బేస్‌ చేసుకుని గెలిచిన ధర్మపురి అరవింద్‌ మాట మార్చడంపై మండిపడుతున్నారు రైతులు. పొగాకు ప్రత్యేక బోర్డు ఉన్నప్పుడు పసుపుకు బోర్డు వద్ద అని రైతులు ప్రశ్నిస్తున్నారు.  పసుపు ఈ దేశానికి గర్వకారణం,దేశ పవిత్రతకు చిహ్నం, హైందవ ధర్మంలో,భారతీయ సంస్కృతిలో పసుపు అత్యంత విశిష్టమైన పదార్ధం. నిరంతరం హిందు సంప్రదాయం గురించి మాట్లాడే బీజేపీ నేతలకు పసుపును మించిన ప్రత్యేక అంశం ఉందా అని దుయ్యబడుతున్నారు.

అంతేగాదు పొగాకు బోర్డు,కాఫీకి బోర్డు ఉన్న దేశంలో పసుపుకు బోర్డు ఎందుకు ఉండకూడదని బీజేపీ నేతలను నిలదీస్తున్నారు. 30 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌లో పసుపుబోర్డు ఏర్పాటు చేయడానికి డబ్బులు లేవా అని ఎద్దేవా చేస్తున్నారు.  మార్కెట్లో మంచి ధర ఉన్న స్ధానికంగా మాత్రం ధర లేకపోవడంతో తాము ఎందుకు నష్టపోవాలని ప్రశ్నిస్తున్నారు. పైగా రైతులే పసుపు బోర్డు వద్దంటున్నారని బీజేపీ నేతలు ప్రచారం చేయడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -