టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్‌కు మ‌రో షాక్‌

61
tv9 ceo raviprakash

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ కు మరో షాక్ తగిలింది. తమను డైరెక్టర్లుగా తొలగించవద్దంటూ హైదరాబాద్ లోని ఎన్సీ ఎల్టీని రవిప్రకాశ్ అండ్ టీం ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని NCLTలో రవిప్రకాశ్, ఆయన సన్నిహితులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరగకుండా స్టే విధించింది ఢిల్లీలోని నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రిబ్యునల్‌(NCLAT). కొత్త యాజమాన్యం డైరెక్టర్ల పదవుల్లో నుంచి తమను తొలగించకుండా చూడడంతో పాటు, విధులు నిర్వహించకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ హైదరాబాద్‌లోని NCLTని ఆశ్రయించారు రవిప్రకాశ్, ఆయన సన్నిహితులు.

ABCL, అలంద, చింతలపాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐల్యాబ్స్ వెంచర్ క్యాపిటల్‌తో పాటు కొత్తగా సంస్థలో చేరిన డైరెక్టర్లకు వ్యతిరేకంగా ఈ కేసును దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను సవాల్ చేస్తూ, ఢిల్లీలోని NCLATను అలంద మీడియా ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన NCLAT త్రిసభ్య ధర్మాసనం, రవిప్రకాశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను NCLT విచారణకు స్వీకరించడంపై స్టే విధిస్తూ… తదుపరి విచారణను జులై9, 2019కు వాయిదా వేసింది.

ఈ ఉత్తర్వుల ఆధారంగా .. హైదరాబాద్‌లోని NCLT కూడా ఈ కేసును జులై 12, 2019కు వాయిదా వేసింది. ఢిల్లీలోని NCLAT ఇవ్వబోయే తదుపరి ఉత్తర్వుల ఆధారంగానే హైదరాబాద్‌లో విచారణ ఉంటుందీ లేనిదీ తేలనుంది. దీంతో, ABCL కొత్త యాజమాన్యానికి సంస్థలో పాత యాజమాన్యం చేసిన అక్రమాలపై చట్టపరమైన చర్యలు తీసుకునే విషయంలో ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయినట్లయ్యింది.